తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పదేళ్లు అధికారం దక్కలేదు: సీఎం రేవంత్ రెడ్డి

  • పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్
  • కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి
  • ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ ఇచ్చారని వెల్లడి
  • గత పదేళ్లు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యలు
ఇవాళ తెలంగాణ పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ... ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వెల్లడించారు. కానీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పదేళ్ల పాటు అధికారం దక్కలేదని అన్నారు. 

గత పదేళ్లు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసిన అనంతరం, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ విజయంలో కార్యకర్తలదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. 

ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రుణమాఫీ చేశామని... రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామని, చేసి చూపించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన రెండో రోజు నుంచే హామీల అమలు మొదలైందని, తమది పేదల ప్రభుత్వం అని నిరూపించామని అన్నారు.


More Telugu News