ఎంఎస్ ధోనీపై కీలక నిర్ణయానికి వచ్చిన సీఎస్కే.. ఇక అంతా బీసీసీఐ చేతుల్లోనే!

  • రిటైర్డ్ ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ కేటగిరిలో చేర్చాలని బీసీసీఐని సీఎస్కే కోరినట్టుగా వార్తలు
  • పాత నిబంధనను తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి
  • అదే జరిగితే తక్కువ ధరకే ధోనీని సీఎస్కే కొనసాగించుకునే అవకాశం
తదుపరి ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆటగాళ్ల మెగా వేలం జరగనుండడంతో బీసీసీఐ ఇందుకు సంబంధించిన కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ సంఖ్యపై వివిధ ఫ్రాంచైజీలు చేసిన సూచనలను ఐపీఎల్ పాలక మండలి పరిశీలిస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు గరిష్ఠంగా 8 మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం ఒక్క ఆటగాడిని కూడా నిలుపుదల చేసుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 5 నుంచి 6 మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై బీసీసీఐ ఇంతవరకు అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. నిజానికి ఆగస్టు చివరి నాటికి రిటెయిన్ ఆటగాళ్ల సంఖ్యపై ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ సెప్టెంబర్ చివరి వరకు వేచిచూడాలని భావిస్తున్నట్టు సమాచారం. రిటైర్ అయిన ఆటగాళ్లను ‘అన్‌క్యాప్డ్’గా వర్గీకరించాలంటూ వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తుండడమే ఈ జాప్యానికి కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది.

రిటైర్డ్ ప్లేయర్లను అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా వర్గీకరించే పాత నిబంధనను తిరిగి ప్రవేశపెట్టాలని బీసీసీఐని చెన్నై సూపర్ కింగ్స్ కోరింది. ఈ రూల్‌ను తిరిగి అమలు చేస్తే ఎంఎస్ ధోనీని తక్కువ ధరలో కొనసాగించవచ్చునని ఆ ఫ్రాంచైజీ యోచిస్తోంది. అయితే ఈ నిబంధన ఒక్క చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రమే కాకుండా ఇతర జట్లకు కూడా ప్రయోజనం చేకూర్చుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే సీఎస్కే అభ్యర్థనను బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్టు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది.

ఎంఎస్ ధోనీ అన్‌క్యాప్డ్ కేటగిరిలో ఉంటే అతడిని తక్కువ ధరకే కొనసాగించవచ్చునని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది. ప్రతి జట్టుకు రిటైర్ అయిన ఆటగాళ్లను రిటెయిన్ చేసుకునే అవకాశం ఇస్తే వారికి ఎంత చెల్లించాలనేది ఫ్రాంచైజీ చేతిలో ఆధారపడి ఉంటుంది. తద్వారా వేలంలో జట్టు వద్ద ఉన్న పరిమిత డబ్బును సద్వినియోగం చేసుకోవచ్చని సీఎస్కే ఫ్రాంచైజీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ నిబంధనను తిరిగి అమలు చేయడానికి బీసీసీఐ అనుమతిస్తుందో లేదో వేచిచూడాలి. మొత్తంగా చూస్తే సీఎస్కేలో ధోనీ రిటెయిన్ బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడినట్టు స్పష్టమవుతోంది.


More Telugu News