అధికారంలోకి వచ్చాక గంటలోపల బీహార్ లో మద్యపాన నిషేధం ఎత్తివేస్తాం.. ప్రశాంత్ కిశోర్

  • తేజస్వీ యాదవ్ యాత్రపై వ్యంగ్యంగా స్పందించిన పీకే
  • తొమ్మిదో తరగతి ఫెయిలైన లీడర్ బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని సెటైర్
  • ఆర్జేడీ, జేడీయూ రెండూ బీహార్ ను ముంచేశాయని వ్యాఖ్య
బీహార్ లో మధ్యనిషేధం అవసరంలేదని, తాము అధికారంలోకి వచ్చిన గంటలోపల నిషేధం ఎత్తివేస్తామని జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న జన సురాజ్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఆ అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. బీహార్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీయూతో పాటు ఆర్జేడీ కూడా రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ యాత్ర చేపట్టడంపై ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యంగా స్పందించారు. కనీసం ఇలాగైనా ఆయన ఇల్లు వదిలి ప్రజల్లోకి రావడం సంతోషకరమని అన్నారు. తొమ్మిదో తరగతి కూడా పూర్తిచేయని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని సెటైర్ వేశారు. తేజస్వీ యాదవ్ కు జీడీపీకి, జీడీపీ గ్రోత్ కు తేడా తెలియదని అన్నారు.
 
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరినందుకు నితీశ్ కుమార్ ముకులిత హస్తాలతో క్షమాపణలు చెప్పారంటూ తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ‘ఎవరు ఎవరికి ముకులిత హస్తాలతో క్షమాపణలు కోరారో తెలియదు కానీ నితీశ్, తేజస్వీ.. ఇద్దరూ బీహార్ కు నష్టం చేశారు’ అని చెప్పారు. బీహార్ కు సీఎం కావాలని ఆశిస్తున్న తేజస్వీ యాదవ్ కు ఉన్న అర్హత ఏంటని ప్రశాంత్ కిశోర్ నిలదీశారు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు కావడం తప్పితే తేజస్వీకి నాయకత్వం వహించేందుకు ఎలాంటి అర్హత లేదని కొట్టిపారేశారు.


More Telugu News