ఏలేరు కాలువకు గండి.. పూడ్చివేసేందుకు శ్రమిస్తున్న అధికారులు

  • మాకవరం మండలం రాచపల్లిలో కాలువ నుంచి వృథాగా పోతున్న నీరు
  • తరచూ ఇలాగే గండ్లు పడుతూ పంటపొలాలు నీట మునుగుతున్నాయని రైతుల ఆందోళన
  • శాశ్వత పరిష్కారం చూపాలంటూ డిమాండ్ చేస్తున్న రైతులు
వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు కాలువకు గండి పడింది. కాకినాడ జిల్లా మాకవరం మండలం రాచపల్లి వద్ద 10 అడుగుల మేర గట్టు తెగిపోయింది. దీంతో అండర్ టన్నెల్ నుంచి వరద నీరు స్థానిక గెడ్డలోకి వెళ్తోంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు ప్రమాదం లేదని తేల్చారు. నీటి వృథాను అరికట్టేందుకు వెంటనే గండి పూడ్చివేత పనులు చేపట్టారు. గండి పడిన చోట ప్రొక్లెయిన్లతో ఇసుక మూటలను వేస్తున్నారు. రెండు, మూడు గంటల్లో గండిని పూడ్చేస్తామని చెప్పారు. ఏలేరు కాలువకు తరచూ గండ్లు పడుతూ తమ పంట పొలాలు నీట మునుగుతున్నాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి చేతికి అందివచ్చిన పంట నాశనమవుతోందని వాపోయారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.



More Telugu News