ఎవరీ లారా లూమర్...? ట్రంప్ ప్రచారంలో అందరి దృష్టి ఆమె పైనే!

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, క‌మలా హ్యారిస్‌ మధ్య హోరాహోరీగా పోరు
  • ట్రంప్ ప్రచారంలో తరచూ కనిపిస్తున్న లారా లూమర్ అనే మహిళ
  • ట్రంప్‌తో లారా లూమర్ పాల్గొనడంపై సొంత పార్టీ రిపబ్లికన్ల నుండే వ్యతిరేకత  
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్స్ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ తరపున క‌మలా హ్యారిస్‌ మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు మరి కొన్ని రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఓ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. ట్రంప్ ప్రచారంలో తరచుగా కనిపిస్తున్న లారా లూమర్ అనే 31 ఏళ్ల యువతి గురించి సొంత పార్టీ రిపబ్లికన్లతో పాటు మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఫారా – రైట్, జాతీయవాద భావాలున్న లారాకు వివాదాస్పద చరిత్ర ఉండటంతో రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. 
 
ముస్లిం వ్యతిరేకిగా పేరున్న లారా లూమర్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి కనిపిస్తున్నారు. 9/11 దాడులు గురించి గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  ఈ ఘటన మనదేశంలో నివసించే వారి పనేనంటూ ఆమె సంచలన కామెంట్స్ చేసింది. 9/11 దాడుల జ్ఞాపకార్థం జరిగిన కార్యక్రమంలో ట్రంప్ తో పాటు లూమర్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ డిబేట్ సమయంలోనూ ఆమె ట్రంప్‌తో పాటు ఫిలడెల్ఫియా వెళ్లారు. ట్రంప్‌తో లూమర్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై పలు మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

వాస్తవానికి ట్రంప్‌తో లూమర్ ఎంత సన్నిహితురాలు అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ట్రంప్‌తో ఆమె పాల్గొనడంపై సొంత పార్టీ రిపబ్లికన్లలోనూ ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే, ట్రంప్ చర్చల్లో లూమర్ జోక్యం చేసుకోలేదని కొందరు పేర్కొంటున్నారు. ఆమె సానుకూల వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో లూమర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ట్రంప్ కు మద్దతుగా స్వతంత్రంగా తాను పని చేస్తున్నట్లు ఆమె పేర్కొంది.


More Telugu News