భారత బౌలింగ్‌ కోచ్‌గా అవకాశం దక్కడంపై తొలిసారి స్పందించిన మోర్నీ మోర్కెల్

  • ఫోన్ ముగిశాక సంతోషంలో 5 నిమిషాలపాటు కూర్చుండిపోయానని వెల్లడి
  • మొదట తనలో తాను ఎంజాయ్ చేశానన్న దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం
  • ఈ విషయం తొలుత తండ్రికి చెప్పానని వెల్లడి
భారత పురుషుల క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం మోర్నీ మోర్కెల్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలోని సహాయక కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా సెప్టెంబరు 1న టీమిండియాతో కలిశాడు. తన కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోనున్న ఈ సందర్భంపై మోర్కెల్ భావోద్వేగంగా స్పందించాడు.

భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా ఎంపికైనట్టు సమాచారం తెలిపిన ఫోన్ కాల్ ముగిశాక 5 నిమిషాలపాటు దాని గురించే ఆలోచిస్తూ కూర్చుండిపోయానని మోర్కెల్ వెల్లడించాడు. 

‘‘ఆ తర్వాత మొదట మా నాన్నకు ఫోన్ చేశాను. నేను నా భార్య దగ్గరకు కూడా వెళ్లలేదు. సాధారణంగా తొలుత భార్యకే చెప్పాలని అంటుంటారు. కానీ నేను మా నాన్నతో మాట్లాడాను. కొన్నేళ్లుగా క్రికెట్ అభిమానిగా ఉన్న ఆయనకు ఏం జరగబోతోందనేది తెలుస్తుందనేది నా ఉద్దేశం. అందుకే ఆయనకు చెప్పాను. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం’’ అని మోర్కెల్ వెల్లడించాడు.

‘‘దాదాపు 5 నుంచి 7 నిమిషాల పాటు నేనొక్కడినే ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పంచుకున్నాను. మంచి అవకాశం అని చెప్పాను. అన్నీ గడిచిపోయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను’’ అని అతడు ఆనందం వ్యక్తం చేశాడు. 

ఈ అవకాశం కేవలం తనకు వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, తన కుటుంబానికి కూడా గర్వకారణమని వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ఆటగాళ్లతో చక్కగా మమేకం అవ్వడం చాలా ముఖ్యమని, ఐపీఎల్‌లో కొందరు ప్లేయర్లతో పనిచేశానని, వారితో ఇప్పటికే కాస్త కనెక్ట్ అయ్యానని మోర్కెల్ తెలిపాడు. ఇకపై భారత శిబిరంలో ఉండి ఆటగాళ్లతో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరచుకోవడం కీలకమని అతడు అభిప్రాయపడ్డాడు.

కాగా మోర్కెల్ 2006 నుంచి 2018 వరకు దక్షిణాఫ్రికాకు 12 ఏళ్లపాటు సుధీర్ఘకాలం ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 247 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 544 వికెట్లు పడగొట్టాడు. ఇక, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆడిన మోర్కెల్... గంభీర్ తో కలిసి లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కోచింగ్ బృందంలో ఒకడిగా పనిచేశాడు.


More Telugu News