హరీశ్ రావు ఎన్నో మోసాలు చేశారు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం పేరుతో మోసాలు చేశారని మండిపాటు
  • హరీశ్ రావు చేసిన మోసాలు ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయన్న మంత్రి
  • మదర్ డైరీ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్లు, కొండా సురేఖకు విజ్ఞప్తి
శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం పేరుతో హరీశ్ రావు ఎన్నో మోసాలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం హరీశ్ రావుకు బినామీగా ఉంది అని ఆరోపించారు. 

నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల మదర్ డైరీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గుడిపాటి మధుసూదన్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గెలిచిన డైరెక్టర్లకు ఎన్నికల అధికారితో కలిసి మంత్రి సర్టిఫికెట్లను అందించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... హరీశ్ రావు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరుకు ఆరు స్థానాలు గెలుచుకుందన్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల్లో మదర్ డైరీ పాలు సరఫరా చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మదర్ డైరీ నుంచి అందే నెయ్యితో లడ్డూలు తయారయ్యేలా చూడాలని మరో మంత్రి కొండా సురేఖను కోమటిరెడ్డి కోరారు. వేములవాడ దేవస్థానం లడ్డూల తయారీకి కూడా మదర్ డైరీ నెయ్యిని ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. మదర్ డైరీని ఇలా ఆదుకోవడం ద్వారా ఈ డైరీకి ఉన్న రూ.60 కోట్ల అప్పును త్వరగా తీర్చవచ్చని తెలిపారు. 

పాల ఉత్పత్తిలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మదర్ డైరీ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.


More Telugu News