భారీ వర్షాల ఎఫెక్ట్... తాజ్ మహల్‌ ప్రధాన డోమ్‌లో వాటర్ లీకేజీ

  • ప్రధాన డోమ్‌లో నీటి చెమ్మ గుర్తింపు
  • కట్టడం దెబ్బ తినలేదని పరిశీలనలో నిర్ధారణ
  • డ్రోన్ కెమెరాలతో పరిశీలించిన అధికారులు 
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు 17వ శతాబ్దపు అద్భుత కట్టడం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌పై గట్టి ప్రభావాన్నే చూపాయి. ప్రధాన డోమ్‌‌పై వాటర్ లీకేజీని గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే డోమ్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పరిశీలనలో అధికారులు గుర్తించారు. పక్కనే ఉన్న గార్డెన్ మొత్తం నీటిలో మునిగిపోయినప్పటికీ తాజ్ మహల్‌ దెబ్బతినలేదని చెప్పారు.

తాజ్ మహల్ పరిశీలన కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని ఆగ్రా సర్కిల్‌ ఆర్కియాలజీ అధికారి రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. ‘‘తాజ్ మహల్ ప్రధాన డోమ్‌లో లీకేజీ ఉందని మేము గుర్తించాం. అయితే చెమ్మ కారణంగా లీకేజీ అవుతోందని తనిఖీలో కనుగొన్నాం. ప్రధాన డోమ్‌కు ఎలాంటి నష్టం జరగలేదని మేము గుర్తించాం. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పరిశీలన చేశాం’’ అని ఆయన వివరించారు. లీకేజీ సమస్య నిరంతరాయంగా కొనసాగడం లేదా అప్పుడప్పుడు ఉంటే దానిపై పర్యవేక్షణ ఉంటుందని రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. 

కాగా కట్టడం ప్రధాన డోమ్‌పై తేమ కనిపించడంతో, వెంట్రుక మందమంత పగులు ఉండొచ్చని అనుమానించామంటూ గతంలో ఒక అధికారి చెప్పారు. దేశంలోని చారిత్రక కట్టడాలను సంరక్షించే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుతం లీకేజీ సమస్యను పర్యవేక్షిస్తోంది. ప్రత్యేక అధికారులు పరిశీలన చేస్తున్నారు.

కాగా తాజ్ మహల్ గార్డెన్ మొత్తం వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలను చూసి స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే పర్యాటక రంగంపై ఆధారపడే వారికి ఇదొక్కటే ఆశ అని మోనికా శర్మ అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన టూర్ గైడ్ విజ్ఞప్తి చేశారు.


More Telugu News