దుబాయ్ యువరాణి భావోద్వేగం... ఆసక్తికర వీడియో ఇదిగో!

  • మీ లాంటివారు ఎవరూ లేరు నాన్నా.. అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన యువరాణి
  • ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రీకూతుళ్ల బంధాన్ని తెలియజేసే వీడియో షేరింగ్
  • ఆసక్తికర కామెంట్లు చేసిన నెటిజన్లు
ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే!.. అన్నట్టుగా దేశానికి ప్రధానమంత్రి అయినా పిల్లలకు మాత్రం నాన్నే!!.. అని చాటిచెప్పారు దుబాయ్ యువరాణి షేఖా లతీఫా ఎంఆర్ అల్ మక్తూమ్. తన తండ్రి, యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పట్ల తనకున్న ప్రేమను ఆమె మరోసారి తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుక్రవారం నాడు అరబిక్‌ భాషలో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. 

‘‘మీలాంటి వారు ఎవరూ లేరు నాన్నా’ అనే క్యాప్షన్‌తో మనసును హత్తుకునే ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని చాటిచెప్పే కొన్ని సన్నివేశాలు ఈ వీడియోలో కనిపించాయి. కాగా ఈ వీడియో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. పెద్ద సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. 

కాగా షేఖా లతీఫా పోస్టుపై పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. తండ్రీ-కూతుళ్ల బంధాన్ని ఈ వీడియో తెలియజేస్తోందని పలువురు పేర్కొన్నారు. గొప్ప నాయకుడికి గర్వకారణమైన కూతురు ఆమె అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘గొప్ప ప్రపంచ నాయకుడు, అద్భుతమైన తండ్రి. ఆయన కేవలం తన పిల్లలకు మాత్రమే తండ్రి కాదు, మనలో చాలా మందికి కూడా తండ్రిలాంటి వారు’ అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.

కాగా యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్‌కు మొత్తం 26 మంది సంతానం ఉండగా అందులో షేఖా లతీఫా ఒకరు.  ఆమె 1985న డిసెంబర్ 5న పుట్టారు. దుబాయ్ రాజకుటుంబానికి చెందిన ఆమె దేశంలోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. 2018లో ఆమె దుబాయ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ తిరిగి ఇంటికి వెళ్లారు. ఇక ప్రధాని షేక్ మొహమ్మద్ కూతుళ్లలో ఒకరైన షేఖా మహరా కూడా ఇటీవల వార్తల్లో నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన విడాకుల విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఈ వారంలోనే ‘డివోర్స్’ పేరిట ఆమె నూతన పెర్ఫ్యూమ్‌ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.


More Telugu News