జగన్ ఐదేళ్ల పాలనే అతి పెద్ద విపత్తు... చంద్రబాబు ప్రజలను గట్టెక్కించారు: నాదెండ్ల మనోహర్

  • గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయన్న నాదెండ్ల
  • ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపాటు
  • పేపర్లు చేతిలో పట్టుకుని ఊగిపోతే లీడర్ కాలేడని ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరదలు, వర్షాలతో భారీ నష్టం వాటిల్లిందని, లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని... ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా క్షేత్ర స్థాయిలో ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 74 ఏళ్ల వయసులో తన అనుభవంతో విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారని కొనియాడారు.   

గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాపాల వల్లే ఈరోజున ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని నాదెండ్ల విమర్శించారు. పిఠాపురంకు వెళ్లి పది పేపర్లను చేతిలో పెట్టుకుని పెద్ద జ్ఞానిలా జగన్ హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచన జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. మూడు నెలల కూటమి పాలన చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. 

ఏనాడైనా జగన్ జేబులో నుంచి లక్ష రూపాయలు సామాన్యుడికి సాయం చేశారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడు పరదాలు కప్పుకుని ప్రజలకు కనిపించకుండా జగన్ తిరిగారని... అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ జనాల్లోకి వచ్చారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో విపత్తులు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ఏనాడూ విమర్శలు చేయలేదని చెప్పారు. 

నాయకుడు అంటే చంద్రబాబు, పవన్ లాగా స్పందించే మనసు ఉండాలని అన్నారు. పేపర్లు చేతిలో పెట్టుకుని ఊగిపోతే జగన్ లీడర్ అనిపించుకోలేరని చెప్పారు. చంద్రబాబు ప్రతిరోజు నాలుగు సార్లు వరదల్లో తిరిగారని... జగన్ ఏరోజైనా ప్రజల కోసం పని చేశారా? అని ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.


More Telugu News