ఏపీ సర్కార్ చొరవతో కువైట్ నుండి క్షేమంగా స్వదేశానికి వచ్చిన బాధితురాలు

  • ఉపాధి కోసం కువైట్ వెళ్లి యజమాని చేతిలో చిత్రహింసలకు గురైన అన్నమయ్య జిల్లా మహిళ కవిత
  • బాధితురాలి సెల్ఫీ వీడియో సందేశంతో స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి 
  • ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో స్వదేశానికి బాధితురాలు తరలింపు
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు పడిన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం తంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను ఏపీ ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కవితను అక్కడ యజమాని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. తనను చిత్ర హింసల నుండి రక్షించాలని వేడుకుంటూ బాధితురాలు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. 

'దయచేసి నన్ను రక్షించండి సార్.. ఇక్కడ చిత్రహింసలకు గురవుతున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. వికలాంగుడైన భర్త ఉన్నారు. వారి కోసమే కువైట్‌కు వచ్చాను. కానీ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతోంది' అంటూ ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఆమె విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెంటనే ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు లేఖ రాశారు. కవితను సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా జోక్యం చేసుకోవాలని కోరారు. 

దీనిపై స్పందించిన మంత్రి శ్రీనివాస్.. ఏపీ ఎన్నార్టీ 24 X 7 హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి, షేక్ రషీదా బేగం సహకారంతో స్వదేశానికి రప్పించారు. శుక్రవారం రాత్రి కువైట్ నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో చెన్నై ఎయిర్ పోర్టుకు కవిత చేరుకుంది.


More Telugu News