అందుకే టెస్టుల‌కు దూరం.. కానీ రెడ్‌బాల్ క్రికెట్‌పై ప్రేమ చాలా ఎక్కువ: బౌలర్ న‌ట‌రాజ‌న్‌

  • వ‌య‌సు రీత్యా ప‌నిభారం త‌గ్గించుకునేందుకు టెస్టులు ఆడ‌టం లేద‌న్న పేస‌ర్‌
  • 2020/21లో బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్‌ సిరీస్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం
  • ఆ అరంగేట్ర మ్యాచే న‌ట‌రాజ‌న్‌కు ఆఖ‌రి మ్యాచ్‌గా మారిన వైనం
ఈ ఏడాది చివ‌ర్లో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీమిండియా పేస‌ర్ టి.న‌ట‌రాజ‌న్ తాజాగా త‌న టెస్టు కెరీర్‌పై కీల‌క విష‌యాల‌ను పంచుకున్నాడు. 2020/21లో బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్‌ సిరీస్ ఆడిన భార‌త జ‌ట్టులో తను కూడా స‌భ్యుడు. ఈ సిరీస్‌లో నాలుగో టెస్టు ద్వారా త‌న టెస్టు కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు తీశాడు. 

అయితే, న‌ట‌రాజ‌న్‌కు ఈ అరంగేట్ర టెస్టు మ్యాచే ఆఖ‌రి మ్యాచ్‌గా మిగిలిపోయింది. వ‌య‌సు రీత్యా ప‌నిభారం త‌గ్గించుకునేందుకు తాను ప్ర‌స్తుతం రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ఈ పేస‌ర్ తెలిపాడు. వ‌రుస గాయాలతో శ‌రీరం స‌హ‌కరించ‌డం క‌ష్టంగా మారుతుంద‌ని, అటువంటి ప‌రిస్థితుల్లో ఈ లాంగ్ ఫార్మాట్‌కు దూరంగా ఉండ‌టం త‌ప్ప త‌న‌కు వేరే మార్గం లేద‌ని వెల్ల‌డించాడు. త‌న టెస్ట్ అరంగేట్రం నుండి తాను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడలేదని నటరాజన్ తెలిపాడు.

"రెడ్ బాల్ క్రికెట్ ఆడి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతోంది. అలాగ‌ని రెడ్ బాల్ క్రికెట్ ఆడకూడదని కాదు. కానీ అది నా పనిభారాన్ని ఎక్కువ చేస్తుందని భావిస్తున్నాను" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ నటరాజన్ అన్నాడు.

"ప్రస్తుతం రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. పనిభారం ఎక్కువైన్నప్పుడు, నా మోకాలి సమస్యలు తిర‌గ‌బెడ‌తాయి. అందుకే లాంగ్ ఫార్మాట్‌ ఆడటం మానేశాను. ప్రస్తుతానికి వైట్ బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానని తెలిపాడు. అయితే, రెడ్ బాల్ క్రికెట్‌పై తనకు ప్రేమ చాలా ఎక్కువ" అని చెప్పుకొచ్చాడు.

"నాకు వైట్ బాల్ క్రికెట్ కంటే రెడ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రణాళిక ప్రకారం జరిగితే కొన్నేళ్ల తర్వాత ఆడతాను. వచ్చే రెండేళ్లు క‌ఠోర శ్ర‌మ చేస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి" అని చెప్పాడు.

ఇక వైట్ బాల్ క్రికెట్‌లో నటరాజన్ ఐపీఎల్‌ 2024లో మెరిశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ పేస‌ర్ 14 మ్యాచుల‌లో 9.05 ఎకానమీ రేటుతో 19 వికెట్లు తీశాడు. కాగా, న‌ట్టూ భారత్ తరఫున రెండు వన్డేలు, 4 టీ20లు కూడా ఆడాడు.


More Telugu News