ఆంధ్ర ఓటర్లను బీఆర్ఎస్ కు దూరం చేసే కుట్ర జరుగుతోంది: కౌశిక్ రెడ్డి

  • సెటిలర్లు అంటే తమకు చాలా గౌరవమన్న కౌశిక్ రెడ్డి
  • కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని వ్యాఖ్య
  • రేవంత్ నీచ రాజకీయాల వల్ల సెటిలర్లు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ
ఆంధ్ర సెటిలర్లను తమ పార్టీకి దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఏనాడు ఇబ్బందులు కలగలేదని చెప్పారు. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కేసీఆర్ కు, బీఆర్ఎస్ నేతలకు గౌరవమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీచమైన రాజకీయాల వల్ల సెటిలర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

సెటిలర్స్ అనే పదాన్ని తాను వాడలేదని... తాను ఆంధ్రా అనే పదాన్ని వాడి ఉంటే... అది తనకు, అరికెపూడి గాంధీకి వ్యక్తిగతమని కౌశిక్ రెడ్డి చెప్పారు. సెటిలర్లను కేసీఆర్ కంటికి రెప్పలా చూసుకున్నారని... అందుకే హైదరాబాద్ లో సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారని తెలిపారు. 

కాంగ్రెస్ మంత్రులు కూడా తన స్థాయికి దిగజారిపోయారని కౌశిక్ ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వ రౌడీయిజాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. పోలీసుల అండతో ప్రభుత్వాన్ని నడపలేరని చెప్పారు. 

ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. తనకు అండగా నిలిచిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.


More Telugu News