బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ల ఓట్లు వద్దా? కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి: నట్టి కుమార్

  • ప్రాంతీయత గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడటం దారుణమన్న నట్టి కుమార్
  • ఆంధ్ర ప్రజలను కించపరచడం బీఆర్ఎస్ విధానమా? అని ప్రశ్న
  • కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సినీ నిర్మాత నట్టి కుమార్ విమర్శలు గుప్పించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిందని... రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నారని... అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో ప్రాంతీయత గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడటం దారుణమని అన్నారు. కౌశిక్ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. 

కౌశిక్ రెడ్డిని వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ ను నట్టి కుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల విధానం కూడా కౌశిక్ రెడ్డి విధానమేనని భావించాల్సి వస్తుందని చెప్పారు. ఆంధ్ర ప్రజలను కించపరచడం బీఆర్ఎస్ విధానమా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ నగర అభివృద్ధిలో, తెలంగాణలో పరిశ్రమలు, వ్యాపారాలను స్థాపించడంలో ఆంధ్ర ప్రజలు కీలక పాత్ర పోషించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

ఎన్నికలప్పుడు ఆంధ్ర వాళ్ల ఓట్లను బీఆర్ఎస్ ఉపయోగించుకుందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపులో ఆంధ్ర వాళ్ల ఓట్లు కీలకం కాదా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్ల ఓట్లు మీకు అవసరం లేదా? అని అడిగారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు. 

ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వివాదంలో... ఆంధ్ర ప్రజల పేరెత్తి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు.


More Telugu News