ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకువస్తారా?: దానం నాగేందర్ ఆగ్రహం

  • కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వైఖరా? లేక వ్యక్తిగతమా? అని నిలదీత
  • ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారని మండిపాటు
  • కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తెలుసునని చురక
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా? లేక వ్యక్తిగతమా? చెప్పాలని నిలదీశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ ఇవాళ అరికెపూడి గాంధీ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని సూచించారు.

అరికెపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం పేరిట బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసునని ఎద్దేవా చేశారు. తాము అన్నీ చేసే ఇక్కడి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమైతే బీఆర్ఎస్ ఆయనను సస్పెండ్ చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఎక్కడైనా ఇంట్లో చేస్తారా? అని నిలదీశారు. అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.


More Telugu News