బంగ్లాతో టెస్టు కోసం చెన్నై చేరుకున్న రోహిత్, కోహ్లీ.. ఇదిగో వీడియో!

  • ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు 
  • ఈ మ్యాచ్ కోసం చెన్నై చేరుకున్న రోహిత్‌, కోహ్లీ, బుమ్రా, పంత్‌
  • ఆట‌గాళ్ల రాక‌తో విమానాశ్ర‌యంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు
ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడ‌నుంది‌. చెన్నై వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ తొలి టెస్టు కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ తాజాగా చెన్నై చేరుకున్నారు. క‌ట్టుదిట్ట‌మైన‌ భద్రతా సిబ్బంది మ‌ధ్య చెన్నై విమానాశ్రయం నుంచి హిట్‌మ్యాన్‌, కోహ్లీ బయటకు వ‌స్తూ కనిపించారు. 

గురువారం రాత్రి రోహిత్ రాగా, కోహ్లీ లండన్ నుంచి ఇవాళ‌ తెల్లవారుజామున విమానంలో నేరుగా చెన్నైకి వచ్చాడు. టీమిండియా పేస‌ర్‌ జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్‌ పంత్ కూడా గురువార‌మే నగరానికి చేరుకున్నారు.

ఇక ఆటగాళ్లు దాదాపు నెల రోజుల విరామం త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు మైదానంలో అడుగుపెడుతున్నారు. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వ‌న్డే సిరీస్‌లో ప‌రాజ‌యంతో రోహిత్ సేన కాస్తా నిరాశ చెందింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా విజ‌యాల బాట‌ప‌ట్టాల‌ని చూస్తోంది. 

కాగా, గంభీర్, అతని కొత్త సహాయక సిబ్బంది నేతృత్వంలో భార‌త జ‌ట్టుకు ఇది మొదటి టెస్ట్ సిరీస్‌. అటు బ‌ల‌మైన‌ పాకిస్థాన్‌పై 2-0 టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్‌తో బంగ్లాదేశ్ జట్టు మంచి ఊపుమీద ఉంది. దాంతో రోహిత్ సేను బంగ్లాను ఎలా ఎదుర్కొంటుంద‌నే ఆసక్తి నెల‌కొంది.

ఇక కీలకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లకు ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ చాలా కీల‌కం. ఇందులో భార‌త్ గెలిస్తే త‌న పాయింట్ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చుకుంటుంది. ప్రస్తుతం భారత్ 68.52 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 62.50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

మ‌రోవైపు పాక్‌పై టెస్టు సిరీస్ విజ‌యంతో బంగ్లాదేశ్ 45.83 పాయింట్ల‌తో టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి ఎగ‌బాకింది. దీంతో ఆ జ‌ట్టు కూడా భార‌త్‌తో టెస్టు సిరీస్‌ను కీల‌కంగా భావిస్తోంది. ఒక‌వేళ టీమిండియాపై గెలిస్తే ఆ జ‌ట్టు పాయింట్లు పెరుగుతాయి. 

ఇక భార‌త్ ఈ సిరీస్ త‌ర్వాత వ‌రుస‌గా న్యూజిలాండ్‌తో స్వదేశంలో 3 మ్యాచుల‌ టెస్ట్ సిరీస్, అలాగే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆడ‌నుంది.


More Telugu News