అథ్లెట్ కోసం నేల‌మీద కూర్చున్న ప్ర‌ధాని మోదీ.. ఇదిగో వీడియో!

  • పారిస్ పారాలింపిక్స్ ప‌త‌క విజేత‌ల‌తో తన నివాసంలో ప్ర‌ధాని మోదీ భేటీ
  • జావెలిన్ త్రోయర్ నవదీప్ సింగ్‌ను క‌లిసిన స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం
  • నేల‌మీద కూర్చొని మ‌రీ త‌ల‌పై టోపీ పెట్టించుకున్న ప్ర‌ధాని
  • ఈ ఆస‌క్తిక‌ర సంద‌ర్భానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన మోదీ
ఇటీవల ముగిసిన పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త పారా అథ్లెట్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. రికార్డు స్థాయిలో 29 పతకాలు కొల్ల‌గొట్టారు. ఈ సంద‌ర్భంగా పారాలింపియన్‌లను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన నివాసంలో వారిని కలిశారు. 

ఈ భేటీ తాలూకు వీడియోను క్రీడా మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. పతక విజేతలను క‌లిసి ప్రధాని అభినందించడం వీడియోలో చూడవచ్చు. ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క్రీడాశాఖ‌ మంత్రి మన్సుఖ్ మాండవియా, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) హెడ్ దేవేంద్ర ఝఝరియా కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. స్టార్ జావెలిన్ త్రోయర్ నవదీప్ సింగ్ పారిస్ గేమ్స్‌లో ఎఫ్ 41 కేట‌గిరీలో బంగారు పతకం సాధించిన విష‌యం తెలిసిందే. అత‌నితో క‌లిసిన‌ప్పుడు ప్ర‌ధాని మోదీ నేల‌మీద కూర్చొని మ‌రీ త‌ల‌పై టోపీ పెట్టించుకున్నారు. ఈ ఆస‌క్తిక‌ర సంద‌ర్భానికి సంబంధించిన వీడియోను ప్రధాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

తాను తెచ్చిన టోపీని ప్రధాని తలపై పెట్టాలన్న తన అభిలాషను నవదీప్ మోదీ వద్ద వ్యక్తపరచారు. ఇక హైట్ త‌క్కువ‌గా ఉండే న‌వ‌దీప్ కోరికను తీర్చడానికి ప్ర‌ధాని నేల‌మీద‌ కూర్చున్నారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ స‌ర‌దాగా సంభాషించుకోవ‌డం జ‌రిగింది. 'ఇప్పుడు మీరు మ‌రింత పొడుగ‌య్యారు' అంటూ న‌వ‌దీప్‌తో స‌ర‌దాగా ప్ర‌ధాని చెప్ప‌డం వీడియోలో ఉంది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

ఇక పారిస్ క్రీడ‌ల‌కు ఈసారి ఏకంగా 84 మంది అథ్లెట్ల‌ను భార‌త్ పంపించింది. అథ్లెట్లు అద్భుతంగా రాణించి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలతో సహా 29 పతకాలను గెలుచుకోవడం జ‌రిగింది. దీంతో మూడేళ్ల‌ క్రితం టోక్యో గేమ్స్‌లో సాధించిన అత్య‌ధిక ప‌త‌కాల (19) పతకాల రికార్డును భార‌త బృందం అధిగమించింది.

ప‌త‌క విజేత‌ల‌కు ప్ర‌భుత్వం భారీ న‌జ‌రానా
పారిస్ పారాలింపిక్స్‌లోని ప‌త‌క విజేత‌ల‌కు భార‌త ప్ర‌భుత్వం భారీ న‌జారానా ప్ర‌క‌టించింది. స్వర్ణ పతక విజేతలకు రూ.75 లక్షలు, రజత విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్యం సాధించిన క్రీడాకారులకు రూ. 30 లక్షలు ప్ర‌క‌టించింది.


More Telugu News