"బతకడానికి వచ్చినవాళ్లు" అన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి: రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో పుట్టిన నన్ను ఎక్కడి నుంచో వచ్చిన వారు సవాల్ చేస్తారా? అన్న కౌశిక్ రెడ్డి
  • బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కాని వారికి టిక్కెట్లు ఇవ్వొద్దా? అని రేవంత్ రెడ్డి ప్రశ్న
  • పీఏసీ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చామన్న ముఖ్యమంత్రి
  • నాడు కాంగ్రెస్ ఉండగా అక్బరుద్దీన్ ఒవైసీకి ఎందుకిచ్చారని ప్రశ్న
"బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ... వారికి టిక్కెట్లు ఇవ్వవద్దా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి" అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని... ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసిరితే చూస్తూ కూర్చుంటామా? అని అరికెపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు.

ఈ వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

పీఏసీ పదవిని తాము ప్రతిపక్షానికే ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను స్పీకర్ ప్రకటించారని, అప్పుడు ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. అలాగే 2019 నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్‌గా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండగా అక్బరుద్దీన్‌కు ఆ పదవిని ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.

సీతారాం ఏచూరి మృతిపై సంతాపం

సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన మృతి దేశ రాజకీయాలకు తీరని లోటు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేశారని గుర్తు చేసుకున్నారు.


More Telugu News