భారత్-చైనా సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు

  • బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు 75 శాతం పూర్తయ్యాయని వ్యాఖ్య
  • సరిహద్దులో చైనా సైనికీకరణ పెరుగుతుండడమే అతిపెద్ద సవాలన్న జైశంకర్
  • జెనీవాలో జరిగిన ‘జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ’లో మాట్లాడిన విదేశాంగ మంత్రి
చైనాతో బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు దాదాపు 75 శాతం పరిష్కారం అయ్యాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం నాడు వెల్లడించారు. తూర్పు లడఖ్‌ సరిహద్దు వివాదంపై మాట్లాడుతూ... చైనా సైనికీకరణ పెరుగుతుండడం అతిపెద్ద సవాలుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో జరిగిన ‘జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జూన్ 2020 నాటి గాల్వాన్ వ్యాలీ ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయని జైశంకర్ వెల్లడించారు. సరిహద్దులో హింస ఉండకూడదని, ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. కాగా చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. 

‘‘చర్చలు కొనసాగుతున్నాయి. కొంత మేర మేము పురోగతిని సాధించాం. చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు.

సరిహద్దులో సైనికీకరణ సమస్యను పరిష్కరించాలని భావించామని, అయితే ఈలోగా గాల్వాన్ ఘర్షణ జరగడంతో మొత్తం సంబంధాలు ప్రభావితం అయ్యాయని అన్నారు. వివాదానికి పరిష్కారం లభిస్తేనే సంబంధాలు మెరుగుపడతాయని జైశంకర్ వ్యాఖ్యానించారు. సమస్యకు పరిష్కారం లభించి శాంతి నెలకొంటే తాము ఇతర అవకాశాలపై దృష్టిసారిస్తామని చెప్పారు.


More Telugu News