సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఇంట్లో గణేశ్ పూజకు ప్రధాని మోదీ... చెలరేగిన తీవ్ర రాజకీయ దుమారం

  • జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణేశ్ పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ
  • ఈ కలయిక ఆందోళనకర సందేశాన్ని ఇస్తోందంటున్న విపక్షాలు
  • ప్రజలకు సందేహాలు కలుగుతాయన్న సంజయ్ రౌత్
సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇంట్లో ఇవాళ జరిగిన గణేశ్ పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనడంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని, చీఫ్ జస్టిస్ కలయిక ఆందోళనకర సందేశాన్ని పంపుతోందని విపక్ష నాయకుల్లో ఒక వర్గం ఆరోపించింది. 

శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందిస్తూ... ఇలాంటి సమావేశాలు సందేహాలను రేకెత్తిస్తాయని వ్యాఖ్యానించారు. శివసేన యూబీటీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య వివాదానికి సంబంధించిన కేసు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయని, అయితే ప్రధాని ఇప్పటివరకు ఎంత మంది ఇళ్లకు వెళ్లారో తన వద్ద సమాచారం లేదని అన్నారు. ఢిల్లీలో చాలా చోట్ల గణేశ్ ఉత్సవాలు జరుగుతాయని, అయితే ప్రధాని మాత్రం చీఫ్‌ జస్టిస్‌ ఇంటికి వెళ్లారని, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఇద్దరూ కలిసి హారతి ఇచ్చారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షకులు, రాజకీయ నాయకులను ఈ విధంగా కలుస్తూ ఉంటే ప్రజలకు సందేహాలు కలుగుతాయని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత కేవలం సిద్ధాంతపరంగా ఉంటే సరిపోదని, ఆచరణలో కూడా ఉండాలని ఆర్జేడీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా వ్యాఖ్యానించారు. గణపతి పూజ అనేది వ్యక్తిగత విషయమని, అయితే ప్రధాని, చీఫ్ జస్టిస్‌ లాంటి పెద్ద వ్యక్తులు ఫొటోలు బయట పోస్ట్ చేయడానికి అంగీకరిస్తే ఇంకేం చెప్పగలమని, ఆందోళనకర సందేశాన్ని పంపించినట్టేనని అన్నారు.

అయితే చీఫ్ జస్టిస్ ఇంట్లో గణేశ్ పూజకు ప్రధాని హాజరుకావడం నేరం కాదని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు అనేక సందర్భాల్లో వేదికలను పంచుకుంటారని వ్యాఖ్యానించింది. 2009లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌ హాజరయ్యారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ప్రస్తావించారు.

కాగా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గురువారం జరిగిన గణేశ్ పూజలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ప్రధానికి చంద్రచూడ్ దంపతులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో అనంతరం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ‘‘సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ గారి నివాసంలో జరిగిన వినాయకుడి పూజలో భాగమయ్యాను. భగవంతుడు గణేశ్ మనందరికీ ఆనందం,  ఆరోగ్యం, సిరిసంపదలతో దీవించాలని కోరుకున్నాను’’ అని రాసుకొచ్చారు. ఒక ఫోటోను కూడా మోదీ షేర్ చేశారు. ఈ ఫొటోలో చీఫ్ జస్టిస్‌ దంపతులు కనిపించారు. 


More Telugu News