'దేవ‌ర' చూడాలి.. అప్ప‌టివ‌ర‌కు బ‌తికించండి.. ఎన్టీఆర్ ఫ్యాన్ చివ‌రి కోరిక‌!

  • గ‌త కొంత‌కాలంగా బోన్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న కౌశిక్
  • అత‌నికి యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ అంటే వీరాభిమానం
  • తార‌క్ త‌ర్వాతి చిత్రం దేవ‌ర చూడాల‌ని కోరుకుంటున్న వీరాభిమాని
  • అప్ప‌టి వ‌ర‌కు త‌మ కుమారుడిని బ‌తికించాల‌ని వైద్యులను వేడుకున్న పేరెంట్స్‌
ఏపీకి చెందిన 19 ఏళ్ల‌ కౌశిక్ గ‌త కొంత‌కాలంగా బోన్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం కౌశిక్ వ్యాధి ఆఖ‌రి స్టేజీలో ఉంది. అత‌నికి యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ అంటే వీరాభిమానం. దాంతో తార‌క్ తాజా చిత్రం దేవ‌ర చూడాల‌ని కోరుకుంటున్నాడు. ఈ నెల 27న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అందుకే అప్ప‌టివ‌ర‌కైనా త‌మ కుమారుడిని బ‌తికించి, అత‌ని చివ‌రి కోరిక తీర్చాల‌ని పేరెంట్స్ వైద్యుల‌ను వేడుకుంటున్నాడు. 

ఈ మేర‌కు వారు తిరుప‌తి ప్రెస్‌క్ల‌బ్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. "మా కుమారుడికి చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఆఖ‌రి కోరిక‌గా దేవ‌ర సినిమా చూడాల‌ని అడుగుతున్నాడు. సెప్టెంబ‌ర్ 27న మూవీ విడుద‌ల అవుతుంది. అప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను బ‌తికించాల‌ని వైద్యుల‌ను వేడుకుంటున్నాడు. అది ఒక్క‌టే అత‌ని ఆఖ‌రి కోరిక‌" అంటూ కౌశిక్ త‌ల్లిదండ్రులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.   

త‌న కుమారుడి వైద్యానికి రూ. 60ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని ప్ర‌భుత్వం, దాత‌లు సాయం చేయాల‌ని వారు కోరారు. ఈ వీడియోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఆయ‌న్ని ట్యాగ్ చేస్తున్నారు. ఇక అభిమానులంటే ఎంతో ఆప్యాయ‌త చూపించే తార‌క్ త‌ప్ప‌నిస‌రిగా కౌశిక్‌తో మాట్లాడుతార‌ని అభిమానులు చెబుతున్నారు.


More Telugu News