హీరో ఎక్స్‌ట్రీం అప్‌గ్రేడెడ్ వెర్షన్ వచ్చేసింది.. గత మోడల్ కంటే చవక!

  • బైక్ డిజైన్, లుక్‌లో మార్పులు చేయని హీరో
  • గత మోడల్ కంటే రూ. 10,525 తక్కువకే అందుబాటులోకి
  • మొబైల్ చార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు
కొన్ని నెలల క్రితం ‘ఎక్స్‌ట్రీం 160ఆర్ 4వీ’ని విడుదల చేసిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ హీరో తాజాగా పలు మార్పులతో ‘ఎక్స్‌ట్రీం 160ఆర్ 2వీ’ని తీసుకొచ్చింది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ. 1.11 లక్షలు. గత మోడల్ కంటే రూ. 10,525 తక్కువకే వస్తుంది. అలాగే, దీని స్పెసిఫికేషన్లు, లుక్, డిజైన్‌లో పెద్దగా మార్పు లేకున్నప్పటికీ పలు ఫీచర్లను మాత్రం ప్రవేశపెట్టింది. 

ఇందులో ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ డ్రాగ్ రేస్ టైమర్‌ను చేర్చింది. ఈ ఫీచర్ ఈ విభాగంలో ఇదే తొలిసారి. పిలియన్ రైడర్‌కు మరింత సౌకర్యంగా ఉండేలా వెనక సీటును తీర్చిదిద్దారు. సీటు ఎత్తును కూడా తగ్గించారు. హీరో లైనప్‌ని సూచించేలా ‘హెచ్’ గుర్తుతో కొత్త టెయిల్ ల్యాంప్‌ ఉంది. 163.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ గరిష్ఠంగా 8,500 ఆర్పీఎం వద్ద 14.8 బీహెచ్‌పీ శక్తిని, 6,500 ఆర్పీఎం వద్ద 14 ఎంఎం గరిష్ఠ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో 5స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.

హీరో ఎక్స్‌ట్రీం 160 ఆర్ 2వీ బైక్ వెనక పెద్ద టైర్, ఒకే చానల్ ఏబీఎస్, ఎల్‌ఈడీ లైట్లతో వస్తోంది. మొబైల్ చార్జింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. బైక్ ముందు వైపున 37 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, వెనకవైపు 7 స్టేజ్ మోనోషాక్ సస్పెన్సన్ అమర్చారు. బ్రేకింగ్ కోసం ముందువైపు 276 ఎంఎం పెటల్ డిస్క్ బ్రేక్, వెనకవైపు 220 ఎంఎం పెటల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.


More Telugu News