బీఆర్ఎస్ మంచినీళ్ల పథకాన్ని కూడా కాంగ్రెస్ వదలడం లేదు: కేటీఆర్

  • బీఆర్ఎస్ తెచ్చిన పథకాలను వరుసగా రద్దు చేస్తోందన్న కేటీఆర్
  • ఇప్పుడు మంచినీళ్ళ పతకానికి కూడా తూట్లు పొడిచిందని ఆగ్రహం
  • ఉచిత మంచినీటి పథకంపై కుట్రలు చేయడం సిగ్గుచేటు అన్న కేటీఆర్
"మంచినీళ్లను కూడా వదలని జూటా కాంగ్రెస్" అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో ప్రతి పేదవాడి బతుకు ఆగమవుతోందని విమర్శించారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌న్నింటినీ వరుసగా ర‌ద్దు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచినీళ్ల పథకానికి కూడా తూట్లు పొడిచిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం... ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను గాలికి వదిలి బీఆర్ఎస్ పథకాలపై కూడా ప్రతాపం చూపుతోందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి బతుకు ఆగమాగమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహజ్యోతి పథకానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్... బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి పథకంపై కూడా కుట్రలు చేసిందని ఆరోపించారు. ఇది సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు.

ఒకవైపు రుణమాఫీ కాలేదు... డబ్బులు కట్టాలని కొంతమంది రైతులకు నోటీసులు వస్తున్నాయి, మరోవైపు నిరుపేదల ఇళ్లకు హైడ్రా నోటీసులు ఇస్తోంది, ఇప్పుడు నల్లా బిల్లు అంటూ డోర్లకు బిల్లులు అతికిస్తున్నారు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. 'మంచినీటి బిల్లులపై బస్తీవాసుల గగ్గోలు' అంటూ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు.


More Telugu News