పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు కేంద్రం భారీ నజరానా

  • స్వర్ణ పతక విజేతలకు రూ.75 లక్షలు ప్రకటించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
  • రజతం గెలిచిన అథ్లెట్లకు రూ.50 లక్షలు, కాంస్యం గెలిచినవారికి రూ.30 లక్షలు ప్రకటన
  • పారా అథ్లెట్లకు మరింత మద్దతు ఇస్తామని హామీ
ఇటీవలే ముగిసిన పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పతక విజేతలకు భారీ నగదు నజరానా ప్రకటించింది. స్వర్ణ పతక విజేతలకు రూ.75 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్యం సాధించిన అథ్లెట్లకు రూ.30 లక్షలు చొప్పున నగదు రివార్డులు అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేడు కీలక ప్రకటన చేశారు. 

ఆర్చర్ శీతల్ దేవి మాదిరిగా మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో రాణించిన అథ్లెట్లకు రూ. 22.5 లక్షల చొప్పున అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు సన్మానం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న పారాలింపిక్స్‌లో మన పారా అథ్లెట్లు మరిన్ని పతకాలు సాధించేలా ప్రోత్సాహిస్తామని, ఈ మేరకు అన్ని విధాలా మద్దతు ఇస్తామని చెప్పారు. అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మాండవీయ హామీ ఇచ్చారు. 

పారాలింపిక్స్, పారా స్పోర్ట్స్‌లో భారత్ మెరుగుపడుతోందని ఆయన అన్నారు. భారత్ 2016లో 4 పతకాల నుంచి టోక్యోలో 19 పతకాలు చేజిక్కించుకునే వరకు ఎదిగిందని, పారిస్‌లో 29 పతకాలు సాధించి 18వ స్థానంలో నిలిచిందని మన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు.

కాగా పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు చారిత్రాత్మక ప్రదర్శన చేశారు. అంచనాలకు మించి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు కలుపుకొని మొత్తం 29 పతకాలు సాధించారు. మన పారా అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించిన పారాలింపిక్స్ ఇదే కావడం విశేషం. 

కాగా ఈ చారిత్రాత్మక ప్రదర్శనతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య '50' మైలురాయిని దాటింది. కాగా పారిస్ పారాలింపిక్స్‌లో రాణించిన భారత అథ్లెట్ల బృందం నేడు భారత్ చేరుకుంది. అథ్లెట్లకు వందలాది మంది మద్దతుదారులు అపూర్వ స్వాగతం పలికారు.


More Telugu News