ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో నూటికి నూరు శాతం జ‌గ‌న్ పాత్ర ఉంది: వర్ల రామయ్య

  • మీడియా స‌మావేశంలో టీడీపీ నేత వర్ల రామయ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
  • 20 ల‌క్ష‌ల ఎక‌రాలకు సాగు నీటిని అందించే ప్రాజెక్టును కూల్చాల‌ని చూశారంటూ వ్యాఖ్య‌
  • ప్ర‌స్తుతం పోలీసులు అదుపులో ఉన్న‌వారు పాత్ర‌ధారులు మాత్రేమేన‌న్న టీడీపీ నేత‌
  • అసలు సూత్ర‌దారుల‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించేవ‌రకు ప‌క‌డ్బందీగా ద‌ర్యాప్తు చేయాల‌ని సూచ‌న‌
  • ఈ ఘ‌ట‌న ద్వారా మాజీ సీఎం జ‌గ‌న్ క్రిమిన‌ల్ మెంటాలిటీ మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని విమ‌ర్శ‌
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. 

బ్యారేజీ గేట్లను ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రిని, సూరాయపాలెం వాసి కోమటి రామ్మోహన్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం వారిని విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రుప‌రిచారు. న్యాయ‌స్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.  

ఇదే విష‌యమై తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నిందితుల తాలూకు రిమాండ్ రిపోర్టును ఆయ‌న చ‌దివి వినిపించారు. ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ఠపాలు చేయ‌డానికే ఈ కుట్ర చేసిన‌ట్లు నిందితులు అంగీక‌రించార‌ని ఆయ‌న తెలిపారు. మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత స‌జ్ట‌ల రామ‌కృష్ణారెడ్డికి తెలియ‌కుండా ఇది జ‌రిగే ప్ర‌సక్తే లేద‌ని వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. 

దాదాపు 20ల‌క్ష‌ల ఎక‌రాల సాగుకు నీటిని అందించే జాతీయ ఆస్తి అయిన ప్ర‌కాశం బ్యారేజీని ధ్వంసం చేయ‌డానికి కుట్ర చేయ‌డం సిగ్గుచేటు అని అన్నారు. ఇంత పెద్ద కుట్ర వెనుక ఉన్న‌ బ‌ల‌మైన శ‌క్తిని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని డీజీపీ తిరుమ‌ల‌రావును ఆయ‌న కోరారు. ఎట్టిప‌రిస్థితుల్లో ఈ విష‌యాన్ని ఈజీగా తీసుకోవ‌డానికి వీల్లేద‌ని చెప్పారు. పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసి, స‌మ‌యానికి నిందితులను అరెస్టు చేశార‌ని అన్నారు. 

అయితే, అరెస్టైన వారు కేవ‌లం పాత్ర‌ధారులు మాత్ర‌మేన‌ని అస‌లు సూత్ర‌ధారులు వేరే ఉన్నార‌ని వ‌ర్ల రామ‌య్య తెలిపారు. వారిని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని పోలీసులకు సూచించారు. 

ఇలాంటి కుట్ర‌పూరిత చ‌ర్య‌తో చ‌ట్ట‌బ‌ద్ధంగా, ప్ర‌జ‌ల స‌మ్మ‌తితో ఎంపికైన ప్ర‌భుత్వంపై మీరు యుద్దం ప్ర‌క‌టించిన‌ట్లేనని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. దీన్ని దేశ ద్రోహం నేరంతో స‌మానంగా భావించి, అధికారులు సీరియ‌స్‌గా ద‌ర్యాప్తు చేయాల‌ని తెలిపారు.   

అలాగే ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం జ‌గ‌న్‌పై కూడా వ‌ర్ల రామ‌య్య తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి మెంటాలిటీ క్రిమిన‌ల్ మెంటాలిటీ అని విమర్శించారు. ఎన్నిక‌ల్లో గెల‌వడానికి బాబాయ్‌ని గొడ్డ‌లితో న‌రికించాడ‌ని, ఆ త‌ర్వాత కేసు ద‌ర్యాప్తును త‌ప్పుదోవ ప‌ట్టించాడంటూ జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. ఏకంగా సీబీఐ అధికారులపై కేసులు న‌మోదు చేయించే స్థాయికి వెళ్లిన వ్య‌క్తి అని అన్నారు. 

ఇక, గ‌త ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి త‌న‌పై గుల‌క‌రాయితో దాడి చేయించుకున్నాడ‌ని ఆరోపించారు. ఏదో ఒక‌టి చేసి అధికారంలో ఉండాల‌ని చూశాడంటూ జ‌గ‌న్‌పై దుమ్మెత్తిపోశారు. తాను 50 ఏళ్ల నుంచి ప్ర‌భుత్వ పాల‌న విధానాన్ని ప‌రిశీలిస్తున్నాన‌ని, కానీ జ‌గ‌న్ లాంటి నేత‌ను ఎక్క‌డ చూడ‌లేద‌న్నారు. 

ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఐడీ, సీబీఐ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, ఇత‌ర కీల‌క‌ రికార్డుల‌ను జ‌గ‌న్ ద‌గ్ధం చేయించాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇలా విలువైన రికార్డుల‌ను త‌గ‌ల‌బెట్ట‌డం తాను ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. ఎంతో క్రిమిన‌ల్ నాలెడ్జ్ ఉన్న జ‌గ‌న్... ప్ర‌కాశం బ్యారేజీ కూల్చివేత‌కు కుట్ర ప‌న్న‌లేదంటే ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని వ‌ర్ల రామ‌య్య పేర్కొన్నారు. 

ఈ కుట్ర‌లో నూటికి నూరు శాతం జ‌గ‌న్ పాత్ర ఉంద‌ని ఆరోపించారు. మీ వ‌ల్ల ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఇప్పుడు పేరు మార్చుకుని పద్మ‌నాభ రెడ్డిగా మారార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక‌ప్పుడు ఎంతో పేరు ప్ర‌ఖ్యాతలు ఉన్న ముద్ర‌గ‌డ‌ ఇవాళ ఓ మూల‌కు ముసుగు వేసుకుని కూర్చున్నాడని, ఇదంతా జ‌గ‌న్‌ క్రిమిన‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో భాగం అని విమ‌ర్శించారు. 

ప్ర‌తి అధికారి, అధికార‌ యంత్రాంగం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసే ప్ర‌తి అడుగును జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల‌ని వ‌ర్ల రామ‌య్య కోరారు. ఇవాళ ప్ర‌కాశం బ్యారేజీకి ఎస‌రు పెట్టిన వ్య‌క్తి రేపు మ‌రో విధంగా ఏదైనా చేయొచ్చ‌ని, అంద‌రూ త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.


More Telugu News