'ది గోట్' రిజ‌ల్ట్‌ తేడా కొట్ట‌డానికి కార‌ణం ఆ ఐపీఎల్ జ‌ట్టే: ద‌ర్శ‌కుడు వెంకట్ ప్రభు

  • దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో 'ది గోట్' 
  • ఈ నెల 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన మూవీ
  • తెలుగు, హిందీలో అంత‌గా ఆక‌ట్టుకోని విజ‌య్ సినిమా
  • సీఎస్‌కేను హైలైట్ చేయ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌న్న డైరెక్ట‌ర్‌
త‌మిళ‌ స్టార్ హీరో దళపతి విజయ్ న‌టించిన తాజా చిత్రం 'ది గోట్'. ఈ నెల 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. కానీ, తెలుగుతో పాటు బాలీవుడ్‌లో మాత్రం ఈ చిత్రం అంత‌గా అంచ‌నాల‌ను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే గోట్‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వెంకట్ ప్రభు తాజాగా ఈ మూవీ ఫ‌లితంపై షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఆయ‌న కామెంట్స్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 

సినిమాలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ను హైలైట్ చేసే సీన్స్ తెలుగు, హిందీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని ఆయ‌న అన్నారు. అందుకే ఈ రెండు భాషల్లో గోట్‌ అంతగా ఆడలేదని తెలిపారు. ఇదే ఈ రెండు భాష‌ల్లో మూవీ వెన‌క బ‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణమ‌ని చెప్పుకొచ్చారు.

ఇక ఈ చిత్రంలో చాలా అతిథి పాత్ర‌లు ఉన్నాయి. ఇందులో భార‌త‌ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీని ఒక్క సీన్లోనైనా నటింప‌జేయాల‌ని అనుకున్నా అది సాధ్యపడలేదన్నారు డైరెక్ట‌ర్‌. ఆ కార‌ణంగానే ఐపీఎల్‌ విజువల్స్‌ ద్వారా ధోనీని స్క్రీన్ పై చూపించామని తెలిపారు. ఇలా ధోనీని హైలైట్ చేయ‌డం కూడా రెండు ఇండ‌స్ట్రీల ప్రేక్ష‌కులకు న‌చ్చ‌క‌పోయి ఉండొచ్చ‌ని వెంక‌ట్ ప్ర‌భు అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్లు కూడా మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఎంఎస్‌డీని హైలైట్ చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం రాలేద‌న‌డం క‌రెక్ట్ కాద‌ని అభిమానులు చెబుతున్న మాట‌. 

ఇక ఈ సినిమాలో విజయ్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో 'డీ-ఏజింగ్‌' టెక్నాలజీ ఉప‌యోగించి హీరోను పాతికేళ్ల కుర్రాడిగా చూపించారు. విజ‌య్‌ స‌ర‌స‌న‌ మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ప్రశాంత్‌, వైభవ్‌, లైలా తదితరులు న‌టించారు. 

అటు కోలీవుడ్ స్టార్స్ శివ కార్తికేయన్, నటి త్రిష అతిథి పాత్ర‌ల్లో మెరిశారు. యువన్ శంకర్ రాజా మూవీకి బాణీలు అందించ‌గా, ఏజీఎస్‌ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ‌ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.


More Telugu News