యాపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌.. ఇండియాలో విక్ర‌యాలు ఎప్ప‌ట్నుంచంటే..!

  • కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసిన యాపిల్‌
  • సరికొత్త ఫీచ‌ర్ల‌తో కొత్త మొబైల్స్‌ను తీసుకువ‌చ్చిన కంపెనీ
  • ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 119,900
  • ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ. 144,900
  • ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ధరలు వ‌రుస‌గా రూ.79,900, రూ.89,900గా నిర్ణ‌యించిన కంపెనీ
  • మ‌న దగ్గ‌ర ఈ నెల 13 నుంచి ముంద‌స్తు బుకింగ్ చేసుకునే వెసులుబాటు
  • యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ కూడా లాంచ్‌
టెక్ దిగ్గజం యాపిల్ సోమవారం త‌న కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్, పెద్ద సైజు డిస్‌ప్లేలు, వినూత్నమైన ప్రో-కెమెరా ఫీచర్లు, భారీ బ్యాటరీ లైఫ్ వంటి ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో కొత్త ఫోన్ల‌ను తీసుకువ‌చ్చింది. దీంతో ఎంతో కాలంగా ఐఫోన్ 16 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియుల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది.  

ఏ18 ప్రో చిప్‌తో ప‌నిచేసే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లు కొత్త 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాతో పాటు వేగవంతమైన క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. అలాగే ఈ ఫోన్లతో డాల్బీ విజన్‌లో 4కే120 ఎఫ్‌పీఎస్‌ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవ‌చ్చ‌ని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం రంగులలో అందుబాటులో ఉంటాయి. అలాగే 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వెర్షన్ల‌లో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 119,900. ఇక‌ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌  ప్రారంభ ధర రూ. 144,900.

కాగా, ఇండియాలోని వినియోగదారులు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ల‌ను ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ముంద‌స్తు బుకింగ్‌ చేసుకోవ‌చ్చు. సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్ల‌స్‌ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీలలో అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900గా నిర్ణ‌యించిన కంపెనీ, ముంద‌స్తు బుకింగ్‌లు సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొంది.

యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ లాంచ్‌.. ధ‌ర‌లు, ఫీచ‌ర్లు ఇవే..
యాపిల్ వాచ్ సిరీస్ 10ని కూడా తాజాగా లాంచ్ చేసింది. ఇది ఇంటెలిజెన్స్‌ను వాచ్ ఓఎస్ 11 ఆధారంగా ప‌ని చేస్తుంది. ఇందులో స్లీప్ అప్నియా నోటిఫికేషన్‌లు, వేగవంతమైన ఛార్జింగ్, వాటర్ డెప్త్, టెంపరేచర్ సెన్సింగ్ వంటి అద్భుత ఫీచ‌ర్లు ఉంటాయి. 

అలాగే అల్యూమినియం, టైటానియం ఫినిష్‌తో రూపొందించారు. దీంతో ఇవి చాలా తేలిక‌గా ఉంటాయ‌ని యాపిల్ తెలిపింది. చాలా పెద్ద డిస్‌ప్లేతో పాటు చాలా స‌న్న‌గా ఉంటుంది. ఇండియాలోని వినియోగదారుల‌కు సెప్టెంబర్ 20 నుంచి స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. యాపిల్ వాచ్ సిరీస్ 10 ప్రారంభ ధర రూ. 46,900. 

అలాగే ఎయిర్‌పాడ్స్ 4ని కూడా కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధ‌ర‌ రూ. 12,900. ఇక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో రూపొందించిన ఎయిర్‌పాడ్స్ 4ని రూ. 17,900కి అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఎయిర్‌పాడ్స్ ప్రో2 రూ. 24,900కి అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. యూఎస్‌బీ-సీ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ ను రూ. 59,900 ధ‌ర‌తో తీసుకువ‌చ్చింది. ఇవ‌న్నీ కూడా సెప్టెంబరు 20 నుంచి స్టోర్ల‌లో అందుబాటులో ఉంటాయ‌ని యాపిల్ కంపెనీ వెల్ల‌డించింది.


More Telugu News