హైడ్రా... బుడమేరులో ఆక్రమణలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కొందరు తెలిసి... మరికొందరు తెలియక నిర్మాణాలు చేపట్టి ఉండవచ్చునన్న పవన్ 
  • పునరావాసం కల్పించాకే చర్యలు చేపట్టాలన్న జనసేనాని
  • ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ముందుకెళ్లాలని వ్యాఖ్య
హైడ్రా అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇదే సమయంలో ఏపీలో బుడమేరులో ఆక్రమణల వల్ల కాలనీలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హైడ్రా అంశంపై స్పందించారు. ఆయన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... చెరువుల ఆక్రమణలు కొందరు తెలిసి చేయవచ్చు లేదా మరికొందరు తెలియక చేయవచ్చునని హైడ్రాను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అన్నారు. అయితే పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు చేపట్టాలన్నారు. అయితే బాధితుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత... ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్లాలనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకువెళతానన్నారు.

బుడమేరులో ఆక్రమణకు పాల్పడిన వారితో మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉండి ఉంటారన్నారు. అందరితో మాట్లాడి చర్యలు తీసుకుంటే బావుంటుందన్నారు. నదులు, వాగుల ప్రాంతాల్లోని కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు. సుద్దగుడ్డ వాగుపై మాట్లాడుతూ, ఈ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.


More Telugu News