‘బ్లాంక్ చెక్కులు’ తిరస్కరించిన రాహుల్ ద్రావిడ్ !

  • కోచ్‌గా ద్రావిడ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు
  • బ్లాంక్ చెక్కులను సైతం ఆఫర్ చేసిన కొన్ని యాజమాన్యాలు
  • రాజస్థాన్‌ రాయల్స్‌తో అనుబంధం దృష్ట్యా అటువైపే మొగ్గుచూపిన ద్రావిడ్
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2024ను సాధించడంతో జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ఉన్నత స్థితిలో ముగిసింది. కప్‌ను గెలిపించే జట్టును రూపుదిద్దడంలో ద్రావిడ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ఆయనను కోచ్‌గా దక్కించుకొని ఐపీఎల్ టైటిల్‌ను సాధించాలని భావించిన పలు ఫ్రాంచైజీలు... ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. కుదిరితే కోచ్‌గా లేదా మెంటార్‌గా జట్టులోకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేశాయి. కొన్ని ఫ్రాంచైజీలైతే ఏకంగా బ్లాంక్ చెక్కులను కూడా ఆఫర్ చేశాయని, అయినప్పటికీ ఆ ఆఫర్లను రాహుల్ ద్రావిడ్ తిరస్కరించాడని ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది.

2011 ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకుండా ఉంటానని భావించిన తనను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాహుల్ ద్రావిడ్‌కు చక్కటి అనుబంధం ఉందని, అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా అతడు తిరస్కరించాడని కథనం పేర్కొంది. నిజానికి ద్రావిడ్ మూడేళ్ల పాటు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. అయితే 2011 సీజన్ వేలంలో ఆయనను ఆ జట్టు విస్మరించింది. దీంతో, ద్రావిడ్ అమ్ముడు పోకుండా మిగిలిపోతాడని అంతా భావించారు. కానీ రాజస్థాన్ రాయల్స్ రాయల్స్ ఆయనను దక్కించుకుంది. ఆయన కోసం ఆ వేలంలో రూ.3 కోట్లకు పైగా బేస్ ధరతో దక్కించుకుంది. దీంతో ఆ జట్టుపై ద్రావిడ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. 2011 నుంచి 2015 వరకు ఆ జట్టుతో ద్రావిడ్ అనుబంధం కొనసాగింది. 2014, 2015లలో టీమ్ మెంటార్‌గా పనిచేశాడు.


More Telugu News