భారీ వర్షం బీభత్సం.. ఉత్తర కోస్తా ఆంధ్రలో రెడ్ అలర్ట్!

  • బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఉత్తర కోస్తా ఆంధ్రా, గోదావరి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
  • శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ 
  • విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 
  • నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రా, గోదావరి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్డు రవాణాకు అంతరాయం క‌లుగుతోంది.

ఉమ్మ‌డి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరుసగా రెండోరోజు సోమవారం కూడా ఎడ‌తెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వ‌ర‌ద‌నీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి.

ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వ‌స్తున్న వ‌ర‌ద‌నీరు కార‌ణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జ‌ల‌మ‌యం అయ్యాయి. డజన్ల కొద్దీ గ్రామాలకు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. 

ఈ నేప‌థ్యంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప‌లు జిల్లాలకు పోర్ట్ మెటియోలాజికల్ (MeT) కార్యాలయం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో అధికారులు ఆయా జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. 

ఈ మేర‌కు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

మ‌రోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఘాట్ రోడ్లను అధికారులు మూసివేశారు. కాగా, శ్రీకాకుళంలో వరదల్లో ఓ మినీ వ్యాన్ కొట్టుకుపోగా, స్థానికులు వాహ‌నం డ్రైవర్‌ను రక్షించారు.

అనకాపల్లి జిల్లాలోని తాండవ, కల్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దాంతో అధికారులు తాండవ జలాశయం రెండు గేట్లను ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తి సామ‌ర్థ్యం 380 అడుగులు ఉండ‌గా.. ప్ర‌స్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 379 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోని నీరు పక్కనే ఉన్న రోడ్డు మీదుగా ప్రవహిస్తోంది. దాంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

చెరువులు పొంగి పొర్లడంతో ముందుజాగ్రత్త చర్యగా నర్సీపట్నం-తుని మధ్య రహదారిని అధికారులు మూసివేశారు. అటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

అలాగే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కాగా, వరద పరిస్థితిని సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు.

ఇక ఇటీవ‌ల కురిన భారీ వ‌ర్షాల కార‌ణంగా  విజయవాడ, దక్షిణ కోస్తా ఆంధ్రలోని కొన్ని జిల్లాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం నుండి ఇంకా పూర్తిగా కోలుకోక‌ముందే ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్ర వరద ముప్పును ఎదుర్కొంటోంది.


More Telugu News