విజయవాడ వరదల వల్ల పాడైన వాహనాల యజమానులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!

  • దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, ప్లంబింగ్ పనులను ఉచితంగా చేయాలని నిర్ణయం
  • ఖర్చు మరీ ఎక్కువైతే యజమానులు కొంత భరించేలా ప్రణాళిక
  • ఒకటి రెండ్రోజుల్లోనే దీనిపై స్పష్టత
  • అనంతరం కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయనున్న ప్రభుత్వం
విజయవాడ వాసులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వరదల్లో దెబ్బతిన్న, మునిగి పాడైన వాహనాల మరమ్మతులకు అయ్యే ఖర్చులో కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.  పాడైన ఇంట్లోని ఉపకరణాల ఖర్చులోనూ కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాదిమందికి లబ్ధి జరగనుంది. గత రాత్రి విజయవాడ కలెక్టరేట్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

వాహన కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు
వరదల కారణంగా బైక్‌లు, ఆటోలు, కార్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నింటికి బీమా ఉండగా, బీమా లేని వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అసలు వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఇది అదనపు ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ముందుకొచ్చి మరమ్మతులు చేయించి ఇవ్వాలని నిర్ణయించింది. రిపేరుకు తక్కువ మొత్తం అయితే ప్రభుత్వమే భరించాలని, ఎక్కువ అయితే మాత్రం కొంత వాటి యజమానులు కూడా భరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరమ్మతు పనుల కోసం ఆయా వాహన తయారీదారులతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే, వారి వద్ద సీఎస్ఆర్ నిధులు ఉంటాయి కాబట్టి వాటితో ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వాలని కోరుతోంది.

అర్బన్ కంపెనీకి పనులు
వరదల కారణంగా దెబ్బతిన్న ఇంట్లోని ఎలక్ట్రిక్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్‌కు సంబంధించిన మరమ్మతు పనులను ‘అర్బన్ కంపెనీ’కి అప్పగిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వస్తుందని, అనంతరం కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే, నష్టపోయిన వ్యాపారుల విషయంలోనూ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు.


More Telugu News