కూతురి త‌ల‌పై సీసీ కెమెరా అమ‌ర్చిన తండ్రి.. ఎందుకంటే..!

  • త‌ల‌పై సీసీ కెమెరాతో ఉన్న యువ‌తి వీడియో నెట్టింట వైర‌ల్‌
  • త‌న భ‌ద్ర‌త కోసమేన‌ని చెప్పుకొచ్చిన యువ‌తి
  • ఇటీవ‌ల క‌రాచీలో జ‌రిగిన హిట్ అండ్ ర‌న్ కేసు
  • సంప‌న్న కుటుంబానికి చెందిన మ‌హిళ డ్రైవింగ్ కార‌ణంగా ముగ్గురి మృతి
  • ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలోనే త‌న తండ్రి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డి
పాకిస్థాన్‌కు చెందిన ఓ యువ‌తి త‌ల‌పై సీసీ కెమెరా అమ‌ర్చిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో యువ‌తి తన తండ్రి తనను ఆ సెక్యూరిటీ కెమెరా ద్వారా 24/7 పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా త‌న భ‌ద్ర‌త కోసమేన‌ని చెప్పుకొచ్చింది. అస‌లు ఆ తండ్రి ఎందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు, పైగా ఆ యువ‌తి త‌న‌ తండ్రి తీసుకున్న ఈ నిర్ణ‌యానికి ఎందుకు మ‌ద్ద‌తు తెలుపుతోంది? త‌దిత‌ర వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం

వలీద్ సాహబ్ అనే వ్య‌క్తి ఇలా త‌న కూతురి త‌ల‌పై సీసీ కెమెరా అమ‌ర్చి వార్త‌ల్లో నిలిచారు. ఈ క్ర‌మంలో సెక్యూరిటీ కెమెరా త‌ల‌పై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువ‌తిని ప‌ల‌కరించ‌డంతో కీల‌క విష‌యాలు వెల్ల‌డించింది. తండ్రి తీసుకున్న నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా? అని ఆమెను అడిగినప్పుడు.. తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పింది.

అయితే, ఇటీవ‌ల క‌రాచీలో సంచ‌ల‌నం సృష్టించిన హిట్ అండ్ ర‌న్ కేసు కార‌ణంగానే త‌న తండ్రి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ యువ‌తి పేర్కొంది. ఎవ‌రైనా త‌నను యాక్సిడెంట్‌లో చంపినా క‌నీసం సాక్ష్యం ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా త‌ల‌పై సీసీ కెమెరాతో తిరుగుతున్న‌ట్లు తెలిపింది. 

కాగా, క‌రాచీలో సంపన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ఎస్‌యూవీ కారుతో తండ్రి, కూతురు వెళ్తున్న ఓ వాహ‌నాన్ని ఢీకొట్టింది. దాంతో వారిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. గ‌త సోమవారం కరాచీలోని కర్సాజ్ రోడ్డులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కరాచీకి చెందిన పారిశ్రామికవేత్త డానిష్ ఇక్బాల్ భార్య నటాషా ఇలా త‌న కారుతో బైకర్లు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో తండ్రి, కూతురితో పాటు మ‌రో వ్య‌క్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప‌లువురికి గాయాలు అయ్యాయి. 

అయితే, నిందితురాలు న‌టాషాకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ ప్ర‌మాదం ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగింది కాద‌ని పేర్కొంటూ ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, పారిశ్రామికవేత్త డానిష్ ఇక్బాల్ అక్క‌డి ప్ర‌ముఖ‌ 'గుల్ అహ్మద్ ఎనర్జీ లిమిటెడ్' చైర్మన్ అని తెలుస్తోంది.


More Telugu News