ముగిసిన పారాలింపిక్స్ పోటీలు.. కొత్త చ‌రిత్ర లిఖించిన భార‌త అథ్లెట్లు..!

  • ఘ‌నంగా పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుక‌లు
  • భార‌త ప‌తాక‌ధారులుగా ఆర్చ‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్‌, అథ్లెట్ ప్రీతి పాల్‌
  • 29 ప‌త‌కాల‌తో స‌త్తాచాటిన భార‌త అథ్లెట్లు
  • తొలిసారి టాప్‌-20లో భార‌త్‌కు చోటు
పారిస్ వేదిక‌గా ఆగ‌స్టు 28 నుంచి ప్రారంభ‌మైన పారాలింపిక్స్ క్రీడ‌లు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుక‌ల్లో భార‌త ప‌తాక‌ధారులుగా ఆర్చ‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్‌, అథ్లెట్ ప్రీతి పాల్‌లు వ్య‌వ‌హ‌రించారు. ఇక ఈ క్రీడ‌ల్లో ఈసారి భార‌త అథ్లెట్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టారు. ఏకంగా 29 ప‌త‌కాలు కొల్ల‌గొట్టి స‌త్తా చాటారు. ఇందులో 7 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 13 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. 

ఈసారి 25 మెడ‌ల్స్ ల‌క్ష్యంగా పెట్టుకుని బ‌రిలోకి దిగిన భార‌త్ 4 ప‌త‌కాలు అధికంగా సాధించ‌డం విశేషం. అలాగే గ‌త టోక్యో ఒలిపింక్స్ కంటే ఈసారి 10 మెడల్స్ ఎక్కువ రావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈసారి భార‌త్ టాప్‌-20లో చోటు ద‌క్కించుకుంది. 

29 ప‌త‌కాలు సాధించిన ఇండియా 18వ స్థానంలో నిలిచింది. ఇక చైనా అగ్ర‌స్థానం కైవ‌సం చేసుకుంది. ఆ త‌ర్వాత టాప్‌-5లో బ్రిట‌న్‌, అమెరికా, నెద‌ర్లాండ్స్‌, బ్రెజిల్ నిలిచాయి. 

ఘ‌నంగా జ‌రిగిన‌ ఈ ముగింపు వేడుక‌ల్లో ఫ్రెంచ్ మ్యూజీషియ‌న్లు, గ్రామీ అవార్డ్ విన్న‌ర్ అండ‌ర్స‌న్ పాక్‌ల ప్ర‌ద‌ర్శ‌న‌తో స్టేడ్ డి స్టేడియం హోరెత్తింది.


More Telugu News