విశాఖ, అల్లూరి జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది: సీఎం చంద్రబాబు

  • ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
  • కలెక్టర్లను అప్రమత్తం చేశామన్న చంద్రబాబు
  • కొండప్రాంతాల్లో ఉండే వారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏలేరు ప్రాజెక్టు ఇన్ ఫ్లో గమనించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

విశాఖ, అల్లూరి జిల్లాల్లో వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వెల్లడించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. 

విజయవాడలో తాము చేపట్టిన సహాయక చర్యల పట్ల గవర్నర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు. వరదకు కారణాలు, సహాయ చర్యల గురించి గవర్నర్ కు నివేదించామని వెల్లడించారు.  

విజయవాడలో ఇంకా 0.51 టీఎంసీల నీరు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వర్షం లేకుంటే రేపు (సెప్టెంబరు 9) సాయంత్రానికి ఆ నీరు కూడా తగ్గుతుందని వివరించారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

బుడమేరు ఇన్ ఫ్లో, నగరంలో వర్షపాతం చూసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ సామగ్రి బాగు చేయించడం పెద్ద సవాల్ గా మారిందని అన్నారు.


More Telugu News