నా అనుమతి లేకుండా ఈ ఇంట్లోకి ఎవరూ రావడానికి వీల్లేదు: దివ్వెల మాధురి

  • దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దర్శనమిచ్చిన మాధురి
  • మండిపడిన దువ్వాడ భార్య వాణి, కుమార్తెలు
  • ఆ ఇంటిని దువ్వాడ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించారన్న మాధురి
  • తాను రూ.2.5 కోట్లు ఇచ్చానని, బదులుగా ఇంటిని రాశారని వెల్లడి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి, దివ్వెల మాధురి వ్యవహారం ఇటీవల మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తోంది. కొంతకాలంగా భార్య వాణి, ఇద్దరు కుమార్తెలకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్... దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. 

కొన్నివారాలుగా నడుస్తున్న ఈ వ్యవహారంలో నిన్న ఆసక్తికర ఎపిసోడ్ చోటుచేసుకుంది. దువ్వాడ నిర్మిస్తున్న కొత్త ఇంట్లోకి దివ్వెల మాధురి రావడంతో దుమారం రేగింది. రెండో ఫ్లోర్ బాల్కనీలో మాధురి ఉండడాన్ని గమనించిన వాణి, ఆమె ఇద్దరు కుమార్తెలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు వారు ప్రవేశించగా, పోలీసులు అడ్డుకుని వారిని అక్కడ్నించి తరలించారు. 

ఈ నేపథ్యంలో, దివ్వెల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ నిర్మిస్తున్న ఆ కొత్త ఇల్లు తన పేరిట రిజిస్ట్రేషన్ అయిందని వెల్లడించారు. దువ్వాడకు గతంలో తాను రూ.2 కోట్లు ఇచ్చానని, ఆ తర్వాత మరోసారి రూ.50 లక్షలు ఇచ్చానని వివరించారు. 

అందుకు బదులుగానే ఆ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. అందువల్ల తన అనుమతి లేకుండా ఆ ఇంట్లోకి రావడానికి ఎవరికీ అనుమతి లేదని మాధురి స్పష్టం చేశారు. 

కాగా, దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని తన క్యాంపు కార్యాలయం అని చెబుతుండడంపైనా మాధురి స్పందించారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటే ఆ ఇంటిని దువ్వాడకు అద్దెకు ఇస్తానని వెల్లడించారు. 

అటు, దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆ ఇంటిపై స్పష్టత ఇచ్చారు. దివ్వెల మాధురి నుంచి తాను రెండున్నర కోట్లు తీసుకున్నది నిజమేనని చెప్పారు. తిరిగి ఇచ్చేందుకు తన వద్ద ఏమీ లేదని, చేసేది లేక ఆ ఇంటిని ఆమె పేరిట రాసేశానని వెల్లడించారు.


More Telugu News