తెలంగాణలో తక్షణమే కులగణన నిర్వహించాలి: ఆర్.కృష్ణయ్య డిమాండ్

  • రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన ఆర్.కృష్ణయ్య
  • కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలంటూ లేఖ
  • ఈ నెల 20న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ముట్టడి ఉంటుందని వెల్లడి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో వెంటనే కులగణన నిర్వహించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలుపుకోవాలని స్పష్టం చేశారు. 

జాతీయ స్థాయిలో కులగణన ద్వారా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ నిత్యం ఏదో ఒక వేదికపై చెబుతూనే ఉన్నారని, కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మాటే ఎత్తడంలేదని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీ డిక్లరేషన్ ప్రకారం నడుచుకోవాలని కోరితే, అణచివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

 అదే సమయంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలన్న డిమాండ్ తో ఈ నెల 20వ తేదీన తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.


More Telugu News