ఆ ట్వీట్ తో తనకు సంబంధంలేదన్న బ్రహ్మాజీ

  • మాజీ సీఎం జగన్ కు కౌంటర్ ట్వీట్ పై నటుడి వివరణ
  • తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని వెల్లడి
  • పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన బ్రహ్మాజీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా చేసిన ట్వీట్ పై నటుడు బ్రహ్మాజీ తాజాగా వివరణ ఇచ్చారు. ఆ ట్వీట్ తాను చేయలేదని, దానితో తనకు సంబంధంలేదని స్పష్టం చేశారు. ఎవరో తన ట్విట్టర్ హ్యాండిల్ ను హ్యాక్ చేసి సదరు ట్వీట్ పెట్టారని వివరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే..
ఇటీవలి వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు, ముఖ్యంగా విజయవాడ వాసులు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ.. టీడీపీ సర్కారు వైఫల్యం వల్లే ప్రజలకు ఈ దుస్థితి దాపురించిందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కౌంటర్ ట్వీట్ వచ్చింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా క్షణాలలో వైరల్ గా మారింది. 

బ్రహ్మాజీ ట్వీట్ (హ్యాకర్ పెట్టిన) ఇదే..
‘మీరు కరెక్టు సార్.. వాళ్లు చేయ్యలేరు..ఇక నుంచి మనం చేద్దాం.. ఫస్ట్ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైసీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం.. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా’ అంటూ బ్రహ్మాజీ పోస్టు పెట్టారు.


More Telugu News