అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ గుడ్‌బై

  • ఈ నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న సిరీస్‌లో మొయిన్ అలీకి దక్కని చోటు
  • ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశానన్న స్టార్ ఆల్‌రౌండర్
  • యువతరానికి చోటివ్వాలన్న ఉద్దేశంతోనే నిర్ణయమన్న మొయిన్ అలీ
  • 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మొయిన్ చివరిసారి 2024 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌తో ఆడాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై మాట్లాడుతూ.. తనకిప్పుడు 37 సంవత్సరాలని, ఈ నెలలో జరగాల్సిన ఆస్ట్రేలియా సిరీస్‌కు తనను ఎంపిక చేయలేదని పేర్కొన్నాడు. తాను ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశానని, యువ తరానికి చోటివ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.

మొయిన్ 2014లో వెస్టిండీస్ టూర్‌తో వన్డేల్లో అడుగుపెట్టాడు. 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. ఆ తర్వాతి సంవత్సరమే లార్డ్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 68 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 6,678 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో కలిపి 366 వికెట్లు పడగొట్టాడు. 

ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని అలీ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తనకేమీ బాధగా లేదని, తాను ఇప్పటికీ క్రికెట్ ఆడగలనని పేర్కొన్నాడు. ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.


More Telugu News