మున్నేరుకు భారీగా పెరుగుతున్న వరద ..

  • డేంజర్ జోన్ లో మున్నేరు పరివాహక ప్రాంతం
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో మున్నేరుకు భారీగా వరద చేరుకుంటోంది. మున్నేటి వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 24 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మున్నేటికి వరద పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. డేంజర్ జోన్ లో మున్నేరు పరివాహక ప్రాంతం ఉంది. 

ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి వరద పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు అన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మున్నేటి వరద ప్రభావం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని పరివాహక  గ్రామాలకు  ఉండనుండటంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. 
 
ఖమ్మం జిల్లాలో మున్నేటి ముంపు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఆదివారం (ఈరోజు)  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండా లో పర్యటించి పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. అలానే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.


More Telugu News