శభాష్ నిమ్మల గారు .... అభినందించిన నారా లోకేశ్

  • బుడమేరుకు మూడు గండ్లు
  • విజయవాడపై వరద పంజా
  • యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చివేత
  • 64 గంటల పాటు నిద్ర కూడా లేకుండా శ్రమించిన మంత్రి నిమ్మల
  • పనులు జరిగిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నారా లోకేశ్
బుడమేరుకు పడిన మూడు గండ్లు ఎంత పనిచేశాయో అందరికీ తెలిసిందే. విజయవాడ నగర చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పంజా విసిరింది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే బెజవాడకు వరద తగ్గుతుందన్న నేపథ్యంలో, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్పించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. 

ఇవాళ బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్... సహచర మంత్రి నిమ్మల పడిన కష్టాన్ని గుర్తించి శభాష్ అని వీపు తట్టి మరీ అభినందించారు. నిమ్మల పనితీరును మెచ్చుకున్నారు. 

దాదాపు 64 గంటల పాటు నిద్ర లేకుండా, బుడమేరు కట్టపైనే మకాం వేసి అధికారులు, సిబ్బందితో గండ్లు పూడ్చివేతను పర్యవేక్షించిన విధానం నిమ్మల నిబద్ధత, బాధ్యతలకు అద్దంపడుతోంది. ఓ రాత్రి ఈదురుగాలులతో వర్షం పడుతుండగా, నిమ్మల గొడుగు వేసుకున్నప్పటికీ తడుస్తూనే పనులు చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ విధంగా మంత్రి నిమ్మల మూడు గండ్లను విజయవంతంగా పూడ్పించిన తీరు పట్ల నారా లోకేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, బుడమేరు గండ్లు పడిన సైట్ కు వచ్చిన లోకేశ్ కు నిమ్మల పనులు జరిగిన తీరును వివరించారు.


More Telugu News