10 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు... ఖైరతాబాద్ గణేశుడి వద్ద డైవర్షన్స్ ఇవే...!

  • గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
  • నేటి నుంచి 17వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు
  • మహా నిమజ్జనం జరిగే రోజు అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న పోలీసులు
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

భాగ్యనగరంలో లక్షలాది మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం నుంచి... మహా నిమజ్జనం జరిగే ఈ నెల 17 తేదీ అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

ఖైరతాబాద్ గణేశుడి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్‌ గణేశ్ విగ్రహం నుంచి రాజీవ్‌ గాంధీ విగ్రహం మీదుగా మింట్‌ కాంపౌండ్‌ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించడం లేదు. పాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఖైరతాబాద్‌ గణేశ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ రాజ్‌దూత్‌ లైన్‌లోకి అనుమతించడం లేదు. 

ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ లైన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ వాహనాలను అనుమతించడం లేదు.

నెక్లెస్ రోటరీ వద్ద తెలుగుతల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ప్లై ఓవర్‌ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించడం లేదు. ఖైరతాబాద్ పోస్టాఫీస్ లైను ఖైరతాబాద్ రైల్వే గేటు వైపు అనుమతించరు. 

నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్‌ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకుల కోసం వాహనాల కోసం ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.


More Telugu News