ప్రకాశం బ్యారేజిలో దెబ్బతిన్న గేట్లకు కొత్త కౌంటర్ వెయిట్లు... మరో రెండ్రోజుల్లో మరమ్మతులు పూర్తి

  • ఇటీవల కృష్ణా నదికి భారీ వరద
  • కొట్టుకు వచ్చిన నాలుగు బోట్లు 
  • ప్రకాశం బ్యారేజిలో గేట్లను ఢీకొట్టిన బోట్లు
  • కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్న వైనం
ఇటీవల కృష్ణా నది వరదలకు నాలుగు బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దాంతో, బ్యారేజిలో 67, 69 నెంబరు గల గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో, కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి, గేట్ల మరమ్మతు పనులు చేపట్టింది. 

కేవలం రెండ్రోజుల్లోనే గేట్లకు మరమ్మతులు చేసి, కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అమర్చారు. గేట్లకు సంబంధించిన మిగిలిన పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. కృష్ణా నది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో, ఎంతో రిస్క్ తీసుకున్న ఇంజినీర్లు, ఇతర సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. 

5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నప్పటికీ వెనుదీయకుండా, భారీ వర్షాన్ని లెక్కచేయకుండా కౌంటర్ వెయిట్ పనులు పూర్తి చేశారు. ఇంజినీరింగ్ అండ్ ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్యనాయుడు నేతృత్వంలో ఈ మరమ్మతుల ప్రక్రియ కొనసాగుతోంది.

కాగా, ప్రకాశం బ్యారేజి గేట్లకు అమర్చిన కౌంటర్ వెయిట్లను హైదరాబాద్ కు చెందిన బెకెం ఇన్ ఫ్రా కంపెనీ తయారుచేసింది. వీటిని ఆధునిక టెక్నాలజీ సాయంతో ఉక్కు రాడ్లతో రూపొందించారు. ఒక్కో కౌంటర్ వెయిట్ బరువు 17 టన్నులు.

దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వివరాలు తెలిపారు. దెబ్బతిన్న గేట్లకు కౌంటర్ వెయిట్లు అమర్చడం పూర్తయిందని, మరో రెండ్రోజుల్లో గేట్లలో కాంక్రీట్ మిశ్రమం నింపడం కూడా పూర్తవుతుందని, ఆ తర్వాత గేట్లను బిగిస్తారని వివరించారు. తద్వారా ఆ గేట్లు పడవలు ఢీకొన్నా చెక్కుచెదరవని స్పష్టం చేశారు. 

కాగా, బ్యారేజి గేట్లను పడవలు ఢీకొనడంపై అనుమానాలు ఉన్నాయని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఏదో ఒక పడవ వరద సమయంలో కొట్టుకువచ్చిందంటే అర్థం చేసుకోవచ్చని, కానీ ఒకటికిపైగా పడవలు ఒకే సమయంలో కొట్టుకురావడం ఆలోచించాల్సిన విషయమేనని అన్నారు.




More Telugu News