పాక్ క్రికెట్ బోర్డు ఓ స‌ర్క‌స్‌.. అందులో అంద‌రూ జోక‌ర్లే: యాసిర్ అరాఫ‌త్‌

  • స్వ‌దేశంలో బంగ్లా చేతిలో పాక్‌కు ఘోర ప‌రాభ‌వం
  • ఈ నేప‌థ్యంలో పీసీబీతో పాటు జ‌ట్టుపై తీవ్ర వ్య‌తిరేక‌త‌
  • తాజాగా పీసీబీపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్ యాసిర్ అరాఫ‌త్‌
  • ఎప్పుడు ఏం చేస్తుందో బోర్డుకే తెలియ‌దంటూ మండిపాటు
పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు ఇటీవ‌ల స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర ప‌రాభ‌వం ఎదురైన విష‌యం తెలిసిందే. రెండు మ్యాచుల సిరీస్‌ను బంగ్లా క్లీన్‌స్వీప్ చేసింది. ఇలా సొంత గ‌డ్డ‌పై షాన్ మసూద్ నేతృత్వంలోని పాక్‌ జట్టు ఒక చిన్న జ‌ట్టు చేతిలో ఓట‌మి చెంద‌డాన్ని ఆ దేశ‌ క్రికెట్ అభిమానులు, మాజీ ఆట‌గాళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. వారిపై తీవ్ర వ్యతిరేకత వ్య‌క్తమ‌వుతోంది. 

ఈ క్ర‌మంలో పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు యాసిర్ అరాఫ‌త్ పాక్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై నిప్పులు చెరిగాడు. పీసీబీపై తీవ్ర విమర్శలు చేశాడు. 'ఇంగ్లండ్‌తో కీల‌క టెస్టు సిరీస్‌కు ముందు ఆట‌గాళ్ల‌కు ప్రాక్టీస్ అవ‌స‌రం. కానీ విచిత్రంగా పీసీబీ వ‌న్డే క‌ప్ టోర్నీని నిర్వ‌హిస్తోంది. ఎప్పుడు ఏం చేస్తుందో బోర్డుకే తెలియ‌దు' అంటూ మండిప‌డ్డాడు.  

'పాక్ ప్యాషన్' యూట్యూబ్ ఛానెల్‌లో యాసిర్ అరాఫత్ మాట్లాడుతూ.. "బంగ్లాతో సిరీస్‌ను ఘోర ప‌రాజ‌యంతో ముగించారు. ఆటగాళ్ల‌కు ఫిట్‌నెస్, టెక్నిక్ సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జాసన్ గిల్లెస్పీ తిరిగి ఆస్ట్రేలియాకు త‌న కోచింగ్ సేవ‌లు అందిస్తార‌ని విన్నాను. మీరు వ‌న్డే టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయాలు నాకు అర్థం కావ‌డంలేదు. 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక సర్కస్. అందులో అంద‌రూ జోకర్లు ఉన్నారు. వారు తీసుకునే నిర్ణ‌యాలు ఒక జోక్. మ‌న ముందు కీల‌క‌మైన ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీస్ ఉంది. మీరు వన్డేలకు ఆటగాళ్లను రెడీ చేస్తున్నారు. ఇది నాకు సర్కస్‌గా కనిపిస్తోంది. వారి నిర్ణయాలు జోకులుగా ఉన్నాయి" అని పాక్ మాజీ క్రికెట‌ర్‌ చెప్పుకొచ్చారు.


More Telugu News