భార‌త్‌లో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంబంధీకుల ఆస్తి.. రూ.1.38 కోట్ల‌కు వేలం!

  • యూపీలోని భాగ్‌ప‌త్‌లో ముషార‌ఫ్ సంబంధీకుల రెండు హెక్టార్ల భూమి 
  • ఈ నెల 5న రూ. 1.38 కోట్ల‌కు వేలం వేసిన‌ట్లు అధికారుల వెల్ల‌డి
  • ఈ ఆస్తిని 2010లో 'శత్రువు ఆస్తి'గా ప్రకటించిన భార‌త్‌
పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు దివంగత ప‌ర్వేజ్ ముషార‌ఫ్ సంబంధీకుల ఆస్తిని ఈ నెల 5న రూ. 1.38 కోట్ల‌కు వేలం వేసిన‌ట్లు అధికారులు శుక్ర‌వారం వెల్ల‌డించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని భాగ్‌పత్‌లోని బరౌత్ తహసీల్‌లో కొటానా గ్రామంలో ఉన్న రెండు హెక్టార్ల భూమిని ఇలా అధికారులు వేలం వేశారు. 

అయితే, ఈ ఆస్తిని 2010లో భార‌త్‌ 'శత్రువు ఆస్తి'గా ప్రకటించింది. అంటే.. ఇండియాలోని పాకిస్థానీ పౌరుల యాజమాన్యంలోని ఆస్తులకు సంబంధించినవ‌ని అర్థం. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ విభాగం అధీనంలో ఉంటాయి.

కాగా, బరౌత్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అమర్ వర్మ ముషారఫ్ తాత కొటానాలో నివసించినట్లు ధ్రువీకరించారు. "పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తండ్రి సయ్యద్ ముషారఫుద్దీన్, తల్లి జరీన్ బేగం ఎప్పుడూ ఈ గ్రామంలో నివసించలేదు. కానీ అతని మామ హుమయూన్ చాలా కాలం పాటు ఇక్కడ నివసించారు" అని వర్మ పీటీఐతో చెప్పారు.

అలాగే స్వాతంత్య్రం రాక‌ముందు హుమాయున్ నివసించిన ఇల్లు కూడా ఈ గ్రామంలోనే ఉందన్నారు. 2010లో శత్రు ఆస్తిగా ప్రకటించి ఈ భూమిని గురువారం రాత్రి 10.30 గంటలకు వేలం ఖరారు చేశారు. మొద‌ట వేలం రూ. 39.06 ల‌క్ష‌ల‌తో ప్రారంభం కాగా, చివ‌రికి రూ. 1.38 కోట్ల వ‌ర‌కు ప‌లికింది. ఇక విక్ర‌యం ద్వారా వ‌చ్చే మొత్తాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విభాగం ఖాతాలో జమ చేస్తామని భాగ్‌పత్ పరిపాలన సీనియర్ అధికారి తెలిపారు.

"భూమి మా రెవెన్యూ రికార్డులలో 'నూరు' పేరుతో నమోదైంది. ఈ నూరు, పర్వేజ్ ముషారఫ్ మధ్య ఎటువంటి పత్రబద్ధమైన సంబంధం లేదు. నూరు 1965లో పాకిస్థాన్ కు వెళ్లిన నివాసి అని మాత్రమే రికార్డులు చూపిస్తున్నాయి" అని భాగ్‌పత్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) పంకజ్ వర్మ పీటీఐకి చెప్పారు. 

ఆ భూమిని కేంద్ర ప్రభుత్వం శత్రు ఆస్తులుగా ప్రకటించిందని, నిబంధనల ప్రకారమే వేలం వేసిందని ఆయ‌న‌ తెలిపారు. ఇక కొటానా గ్రామంలోని బరౌత్ తహసీల్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ఎలాంటి నివాస ప్రాంతంగా గుర్తించ‌బ‌డ‌లేద‌ని ఏడీఎం పేర్కొన్నారు. 

కాగా, 1999లో పాక్‌లో వ‌చ్చిన‌ తిరుగుబాటు తర్వాత పాకిస్థాన్ మాజీ మిలటరీ చీఫ్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే. 2001 నుంచి 2008 వ‌ర‌కు పాకిస్థాన్ అధ్య‌క్షుడిగా ఆయన ప‌నిచేశారు. గ‌తేడాది ఆయ‌న మరణించిన విష‌యం తెలిసిందే. కాగా, ముషారఫ్ భారతదేశ విభజనకు ముందు ఢిల్లీలో జన్మించారు.


More Telugu News