పారా ఒలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం... ప్రవీణ్ కుమార్ గోల్డెన్ జంప్

  • పారిస్ లో పారా ఒలింపిక్ క్రీడలు
  • భారత్ ఖాతాలో 6వ స్వర్ణం
  • 2.08 మీటర్లతో హైజంప్ లో ప్రథమస్థానంలో నిలిచిన ప్రవీణ్
  • ప్రవీణ్ ను చూసి దేశం గర్విస్తోందన్న ప్రధాని మోదీ
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హైజంప్ ఫైనల్లో 2.08 మీటర్లతో ప్రథమస్థానంలో నిలిచాడు. 

ఈ స్వర్ణంతో పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో పసిడి పతకాల సంఖ్య 6కి పెరిగింది. ఇప్పటిదాకా భారత్ పారిస్ పారా ఒలింపిక్స్ పోటీల్లో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాల సహా మొత్తం 26 పతకాలు కైవసం చేసుకుంది. 

కాగా, ప్రవీణ్ కుమార్ ఘనతతో... భారత్ పారా ఒలింపిక్స్ లో తన అత్యధిక స్వర్ణాల రికార్డును అధిగమించింది. గత టోక్యో పారా ఒలింపిక్ క్రీడల్లో భారత్ 5 పసిడి పతకాలు చేజిక్కించుకుంది. ఇప్పుడు పారిస్ లో 6 గోల్డ్ మెడల్స్ తో ఆ రికార్డును సవరించింది. 

భారత్ కు రికార్డు స్వర్ణం అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తన సంకల్పం, దృఢదీక్షతో మన దేశానికి కీర్తి సాధించిపెట్టాడని కొనియాడారు. ప్రవీణ్ కుమార్ ఘనతను చూసి దేశం గర్విస్తోందని మోదీ ట్వీట్ చేశారు.


More Telugu News