బుడమేరు మూడో గండి పూడ్చేందుకు వచ్చిన 120 మంది ఆర్మీ సిబ్బంది

  • బుడమేరుకు మూడు చోట్ల గండ్లు
  • వరద రూపంలో విజయవాడపై విరుచుకుపడిన బుడమేరు
  • ఇప్పటివరకు రెండు గండ్లు పూడ్చిన ఏపీ ప్రభుత్వం
  • మంత్రి నిమ్మల నేతృత్వంలో రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు
  • మూడో గండి పూడ్చేందుకు సైన్యం సాయం
విజయవాడ వరదలకు ప్రధాన కారణంగా నిలిచిన బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడిన సంగతి తెలిసిందే. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రింబవళ్లు తేడా లేకుండా బుడమేరు కట్టపై మకాం వేసి, గండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు. 

జోరున వాన కురుస్తున్నా ఆయన కట్ట మీద నుంచి పక్కకి రాకుండా, సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. నిమ్మల బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న, రాత్రి భోజనాలన్నీ బుడమేరు కట్టపైనే చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మల ఆధ్వర్యంలో రెండు గండ్లు విజయవంతంగా పూడ్చారు. 

ఇక, మూడో గండి కాస్త పెద్దది కావడంతో, దీన్ని పూడ్చేందుకు కేంద్రం సాయంతో ఆర్మీ సిబ్బందిని పిలిపించారు. నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో, భారత సైన్యానికి చెందిన మద్రాస్ రెజిమెంట్ నుంచి 120 మంది ప్రత్యేక సిబ్బంది బుడమేరు గండి పూడ్చేందుకు వచ్చారు. కాసేపట్లో ఆర్మీ సిబ్బంది బుడమేరు గండి పూడ్చే పనులు ప్రారంభించనున్నారు. 

దీనిపై ఆర్మీ అధికారులు స్పందిస్తూ... ఇనుపరాడ్లతో వంతెన ఏర్పాటు చేసి, దాన్ని రాళ్లతో నింపుతామని, గండి పూడ్చడంలో ఈ విధానాన్ని అనుసరిస్తామని వివరించారు. కాగా, బుడమేరు గండి ప్రాంతానికి ఆర్మీ పరికరాలతో కూడిన వాహనాలు చేరుకుంటున్నాయి.


More Telugu News