తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లో తిరుమల లడ్డూల విక్రయం

  • భక్తులు ఎంతో ఇష్టపడే ప్రసాదం తిరుమల లడ్డూలు
  • భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకుంటున్న దళారీలు
  • దళారీలకు చెక్ పెట్టేందుకు అన్ని ఆలయాల్లో లడ్డూలు విక్రయిస్తున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే భక్తులందరికీ ఎంతో ఇష్టం. అత్యంత రుచికరంగా ఉండే శ్రీవారి లడ్డూలను భక్తులు ఎంతో ఇష్టపడతారు. అయితే, భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు దళారులు అడ్డదారులు తొక్కుతున్నారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు భక్తులకు లడ్డూలను అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆలయాల్లో లడ్డూలు విక్రయించాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ లో ఉండే వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో రూ. 50కి లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాన్ని విక్రయిస్తారు. ఇప్పటి వరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజు లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. 

టీటీడీ ఆలయాలతో పాటు సమాచార కేంద్రాల్లో కూడా లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, దేవుని కడప, విజయవాడ, పిఠాపురం, రాజమండ్రి, విశాఖపట్నం, రంపచోడవడం, అమరావతి, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో లడ్డూలను విక్రయిస్తున్నారు.


More Telugu News