ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం

  • ఏలూరు జిల్లాలో ఒక్కొక్క‌రుగా గుడ్‌బై చెబుతున్న‌ కీల‌క నేత‌లు
  • తాజాగా ఉమ్మ‌డి జిల్లా జ‌డ్పీ ఛైర్‌ప‌ర్సన్ ఘంటా ప‌ద్మ‌శ్రీ దంప‌తుల రాజీనామా
  • త్వ‌ర‌లోనే జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • ఇటీవ‌లే పార్టీ వీడిన‌ ఏలూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు ఆళ్ల నాని, మేయ‌ర్ నూర్జ‌హాన్ దంప‌తులు
ఏపీలోని ఏలూరు జిల్లాలో వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఒక్కొక్క‌రుగా కీల‌క నేత‌లు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఉమ్మ‌డి జిల్లా జ‌డ్పీ ఛైర్‌ప‌ర్సన్ ఘంటా ప‌ద్మ‌శ్రీ, ఆమె భ‌ర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్ర‌సాద‌రావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. 

గురువారం మీడియా స‌మావేశం నిర్వ‌హించిన ఈ దంప‌తులు వైసీపీకి రాజీనామా చేశామ‌ని, త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే త‌మ రాజీనామా లేఖ‌ల‌ను పార్టీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పంపించారు. 

ఈ సంద‌ర్భంగా ప‌ద్మ‌శ్రీ మాట్లాడుతూ.. గ‌త 13ఏళ్లుగా వైసీపీలో ప‌ని చేశాన‌ని, వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డానికి తాము త్వ‌ర‌లోనే జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్లు ఆమె తెలిపారు. అలాగే వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ తాను పార్టీకి రాజీనామా చేయ‌డానికి త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాలేన‌ని పేర్కొన్నారు. 

ఇక ఇటీవ‌ల ఏలూరులో వైసీపీకి వ‌రుస‌గా కీల‌క నేత‌లు అయిన మాజీ డిప్యూటీ సీఎం, ఆ జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల నాని, మేయ‌ర్ నూర్జ‌హాన్, ఆమె భ‌ర్త పెద‌బాబు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ దంప‌తులు పార్టీని వీడారు. అంత‌కుముందు ఏలూరు నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య నేత‌లైన ఇడా మాజీ ఛైర్మ‌న్ బొద్దాని శ్రీనివాస్‌, ఏలూరు మార్కెట్ క‌మిటీ మాజీ ఛైర్మ‌న్ మంచెం మైబాబు పార్టీకి రాజీనామా చేశారు. 

అటు వైసీపీకి చెందిన 19 మంది కార్పొరేట‌ర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. మేయ‌ర్ దంప‌తుల‌తో పాటు బొద్దాని మైబాబు సీఎం చంద్ర‌బాబునాయుడు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డంతో ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్షం లేకుండా పోయింది. 

జ‌డ్పీ రాజ‌కీయాలు కొత్త మ‌లుపు
ఉమ్మ‌డి జిల్లా ప‌రిష‌త్తు ఛైర్‌ప‌ర్స‌న్ ప‌ద్మ‌శ్రీ పార్టీకి గుడ్‌బై చెప్ప‌డంతో జ‌డ్పీ రాజ‌కీయాలు కొత్త మలుపు తిరిగాయి. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి జిల్లాలో 48 మంది జ‌డ్పీటీసీ స‌భ్యులుంటే, వీరిలో 46 మంది వైసీపీ వారే ఉన్నారు. మిగిలిన ఇద్ద‌రిలో టీడీపీ నుంచి ఉప్ప‌ల‌పాటి సురేశ్‌బాబు (ఆచంట‌), జ‌న‌సేన‌కు చెందిన‌ గుండా జ‌య‌ప్ర‌కాశ్ నాయుడు (వీర‌వాస‌రం) ఉన్నారు. అయితే, ఇప్పుడు జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ ప‌ద్మ‌శ్రీ దంప‌తులు రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే వైసీపీ జ‌డ్పీటీసీ స‌భ్యులు కొంద‌రు అసంతృప్తిగా ఉన్న‌ట్లు స‌మాచారం.


More Telugu News