నాడు కాదన్నవారే.. నేడు అతిథిగా ఆహ్వానించారు.. గౌతమ్ అదానీ జీవితంలో సినిమా తరహా ఘటన

  • 1970వ దశకంలో ముంబైలోని జై హింద్ కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న అదానీ
  • తిరస్కరణకు గురైన అప్లికేషన్
  • గురువారం టీచర్స్ డే సందర్భంగా విశిష్ట అతిథిగా ఆహ్వానం
  • సీటు కోసం దరఖాస్తు చేసినందున తమ విద్యార్థిగా గుర్తించిన పూర్వ విద్యార్థుల సంఘం
ఒకనాడు తిరస్కరణకు గురైన వ్యక్తి.. ఆ తర్వాత అతడి రేంజ్‌ మారిపోవడం.. కాదన్నవారే రెడ్ కార్పెట్ స్వాగతాలు పలకడం.. ఇలాంటి ఘట్టాలు సినిమాల్లో కోకొల్లలు. అయితే భారత అపర కుబేరుడు, అదానీ గ్రూపు కంపెనీల అధినేత గౌతమ్ అదానీకి నిజ జీవితంలో ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది.  

గౌతమ్ అదానీ 1970వ దశకం చివరలో ముంబైలో నాడు ప్రఖ్యాతిగాంచిన ‘జై హింద్ కాలేజీ’లో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ అప్లికేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన చదువును ఆపేశారు. వ్యాపారం వైపు అడుగులు వేశారు. అయితే దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థులకు జీవిత పాఠాలు చెప్పేందుకు అదే కాలేజీ ఆయనను విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. దాంతో ఆయన హాజరై ప్రసంగించారు. చదువుకునేందుకు తాను పెట్టిన దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక ఏం చేశారనే విషయాలు, జీవితంలో ఎలా ఎదిగారనే విషయాలను విద్యార్థులకు ఆయన వివరించారు.

కాగా 1977 -1978లో నగరంలోని జై హింద్ కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఆయన దరఖాస్తును తిరస్కరించారని జై హింద్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విక్రమ్ తెలిపారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు తన అన్నయ్య వినోద్ అదే కాలేజీలో చదువుకోవడంతో తాను కూడా ఇక్కడే విద్యాభ్యాసం చేయాలని అదానీ భావించారని చెప్పారు. అదృష్టమో లేక దురదృష్టమో తెలియదు కానీ కాలేజీ నాడు ఆయనకు అడ్మిషన్ ఇవ్వలేదని, దీంతో ప్రత్యమ్నాయంపై ఆయన దృష్టి పెట్టారని విక్రమ్ చెప్పారు. కాలేజీలో చదివేందుకు దరఖాస్తు చేసుకున్నందున ఆయనను పూర్వ విద్యార్థిగా పరిగణిస్తున్నామని తెలిపారు.

కాగా చదువుకుందామని భావించిన కాలేజీలో అడ్మిషన్ దక్కకపోవడంతో 16 ఏళ్ల వయసులోనే గౌతమ్ అదానీ వ్యాపారం వైపు అడుగులు వేశారు. అదే ముంబైలో ‘డైమండ్ సార్టర్‌’గా పని చేయడం మొదలుపెట్టారు. వజ్రాల విలువను అంచనా వేసే వ్యక్తిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. నేడు ఆయన కంపెనీల విలువ సుమారు రూ.18 లక్షలు కోట్లుగా (220 బిలియన్ డాలర్లు) ఉంది.


More Telugu News