క‌పిల్ పార్మ‌ర్‌ చారిత్రాత్మ‌క మెడ‌ల్‌.. 25 ప‌త‌కాల ల‌క్ష్యాన్ని చేరిన భార‌త్‌!

  • భార‌త జూడోకా (జూడో ఆట‌గాడు) క‌పిల్ పార్మ‌ర్‌కు కాంస్యం
  • త‌ద్వారా జూడోలో ప‌త‌కం సాధించిన మొద‌టి భార‌త జూడోకాగా చ‌రిత్ర
  • భార‌త్ ఖాతాలో 25 మెడ‌ల్స్ .. వీటిలో 5 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 11 కాంస్య ప‌త‌కాలు
పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొడుతున్నారు. తాజాగా భార‌త్ ఖాతాలో 25వ ప‌త‌కం చేరింది. భార‌త జూడోకా (జూడో ఆట‌గాడు) క‌పిల్ పార్మ‌ర్ గురువారం జ‌రిగిన‌ పురుషుల 60 కిలోల జే1 ఈవెంట్‌లో కాంస్యం గెలిచారు. ప్ర‌పంచ రెండో ర్యాంక‌ర్ జూడోకా ఎలియెల్ట‌న్ డి ఒలివెరాను ఓడించి ప‌త‌కం సొంతం చేసుకున్నారు. దీంతో క‌పిల్ పార్మ‌ర్ జూడోలో మెడ‌ల్ సాధించిన మొద‌టి భార‌త జూడోకాగా చ‌రిత్ర సృష్టించారు. 

మ‌రోవైపు మిక్స్‌డ్ రికర్వ్ ఓపెన్ ఈవెంట్‌లో ఆర్చర్లు హర్విందర్ సింగ్, పూజ తమ కాంస్య పతక పోరులో ప‌రాజ‌యం పాల‌య్యారు. అంత‌కుముందు వ్య‌క్తిగ‌త విభాగంలో హర్విందర్ సింగ్ గోల్డ్ గెలిచిన విష‌యం తెలిసిందే. ఇక‌ పవర్‌లిఫ్టర్ అశోక్, షాట్ పుటర్ అరవింద్ ఆకట్టుకోలేకపోయారు. సిమ్రాన్ శర్మ కూడా మహిళల 100 మీటర్ల టీ12 ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. 

ఇక టీమిండియా ఈసారి 25 ప‌త‌కాల ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగ‌గా, నిన్నటితో ఆ టార్గెట్‌ను అందుకుంది. మ‌రో మూడు రోజులు గేమ్స్ మిగిలి ఉన్నాయి. దీంతో ప‌తకాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం భార‌త్ ఖాతాలో 25 మెడ‌ల్స్ ఉండ‌గా.. వీటిలో 5 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 11 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. దీంతో ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ 16వ స్థానంలో కొన‌సాగుతోంది.


More Telugu News